8న వైఎస్సార్ జయంతి రోజు ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపనలు
సీఆర్డీఏ పరిధిలో 50,793 మందికి ఇళ్ల పట్టాల పంపిణీ
ప్రభుత్వమే నిర్మించి ఇచ్చే ఆప్షన్ 3 ఇళ్ల వైపు 45,101 మంది మొగ్గు
గుంటూరు : సీఆర్డీఏ పరిధిలో ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలకు చెందిన నిరుపేదల
సొంతింటి కల సాకారం దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం
వేగంగా అడుగులు వేస్తోంది. సీఆర్డీఏ పరిధిలో 50,793 మంది అక్కచెల్లెమ్మలకు
‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద ఇంటి స్థలాలను ఇప్పటికే ఉచితంగా
పంపిణీ చేసిన విషయం తెలిసిందే. ఈ స్థలాల్లో ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించేలా
గృహ నిర్మాణ శాఖ చర్యలు చేపట్టింది. సీఆర్డీఏ పరిధిలో మొత్తం 25 లేఅవుట్లలో
పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేశారు. గుంటూరు జిల్లాకు చెందిన 22,125 మంది
లబ్దిదారులు, ఎన్టీఆర్ జిల్లాకు చెందిన 22,976 మంది ప్రభుత్వమే ఇళ్లను
నిర్మించి ఇచ్చే ఆప్షన్–3ని ఎంపిక చేసుకున్నారు. మొత్తం లబ్దిదారుల్లో 88.79
శాతం మంది ఆప్షన్–3కి మొగ్గు చూపారు.
వైఎస్సార్ జయంతి రోజు శంకుస్థాపన : దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి
సందర్భంగా జూలై 8వ తేదీన సీఆర్డీఏ పరిధిలో పేదల ఇళ్ల నిర్మాణానికి
శంకుస్థాపన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది మే 26వ తేదీన
పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ సందర్భంగా శంకుస్థాపన తేదీని కూడా సీఎం జగన్
ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇళ్ల నిర్మాణం జోరందుకోనుంది.
ఉచితంగా ఇసుక..రాయితీపై 14 రకాల సామగ్రి : విలువైన ఇళ్ల స్థలాలను ఉచితంగా
నిరుపేదలకు పంపిణీ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇంటి నిర్మాణానికి కూడా అండగా
నిలుస్తున్న విషయం తెలిసిందే. ఒక్కో యూనిట్‌కు బిల్లుల రూపంలో రూ.1.80 లక్షలు,
పావలా వడ్డీకి రూ.35 వేలు బ్యాంకు రుణంగా సమకూరుస్తూ రూ.2.15 లక్షలు చొప్పున
అందిస్తోంది. దీనికి అదనంగా ఉచితంగా ఇసుకతోపాటు సబ్సిడీపై స్టీల్, సిమెంట్
లాంటి 14 రకాల నిర్మాణ సామగ్రిని ప్రభుత్వమే సరఫరా చేస్తోంది. వీటి విలువ
రూ.54,518 వరకు ఉంటుంది. ఇదే తరహాలో సీఆర్డీఏ పరిధిలో ఇళ్ల లబ్ధిదారులకు కూడా
ప్రభుత్వం అండగా నిలవనుంది.
అక్కచెల్లెమ్మలకు విలువైన స్థిరాస్తి : నవరత్నాలు–పేదలందరికీ ఇళ్ల పథకం కింద
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకూ 31 లక్షల మందికిపైగా పేదలకు ఇళ్ల పట్టాలను
పంపిణీ చేసింది. రెండు విడతల్లో 21.25 లక్షల ఇళ్ల (సాధారణ ఇళ్లు 18.63 లక్షలు
+ టిడ్కో ఇళ్లు 2.62 లక్షల ఇళ్లు) నిర్మాణాలకు అనుమతులు ఇవ్వగా నిర్మాణాలు
వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. సాధారణ ఇళ్లలో సుమారు నాలుగు లక్షల ఇళ్ల
నిర్మాణాలు ఇప్పటికే పూర్తి అయ్యాయి. ఇళ్ల పథకం ద్వారా ఒక్కో పేదింటి మహిళకు
సగటున రూ.15 లక్షల స్థిరాస్తిని సమకూర్చడం ద్వారా మొత్తం రూ. 3 వేల కోట్ల మేర
సంపదను ప్రభుత్వం సృష్టిస్తోంది.
కొనసాగుతున్న లబ్దిదారుల ట్యాగింగ్ : గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన
కార్యదర్శి అజయ్‌జైన్
సీఆర్డీఏ పరిధిలో మెజారిటీ లబ్దిదారులు ఆప్షన్–3 ఎంచుకున్నారు.
లబ్ధిదారులను గ్రూపులుగా చేసి ట్యాగ్ చేసే పనులు రెండు జిల్లాల్లో
కొనసాగుతున్నాయి. 47 వేల ఇళ్లకు సెంట్రల్ శాంక్షనింగ్ అండ్ మానిటరింగ్
కమిటీ (సీఎస్ఎంసీ) అనుమతులు వచ్చాయి. మిగిలిన ఇళ్లకు కూడా అనుమతులు
వస్తాయి. గృహ నిర్మాణాలకు జూలై 8న శంకుస్థాపన నిర్వహించేలా ఏర్పాట్లు
చేస్తున్నాంమని గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్
తెలిపారు.
అమరావతిలో 47వేల గృహాలకు జూలై 8న శంకుస్థాపన : సీఆర్డీఏ పరిధిలో ఎన్టీఆర్,
గుంటూరు జిల్లాలకు చెందిన నిరుపేదల సొంతింటి కల సాకారం దిశగా ముఖ్యమంత్రి
వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. సీఆర్డీఏ
పరిధిలో 50,793 మంది అక్కచెల్లెమ్మలకు ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద
ఇంటి స్థలాలను ఇప్పటికే ఉచితంగా పంపిణీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో
47వేల గృహాలకు జూలై 8న శంకుస్థాపన చేయనున్నట్టు గృహనిర్మాణ శాఖ స్పెషల్
సీఎస్ అజయ్ జైన్ తెలిపారు. ఈ సందర్భంగా అజయ్ జైన్ మీడియాతో మాట్లాడుతూ
‘గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో 50వేల మంది నిరుపేదలకు మే 26వ తేదీన సీఎం
జగన్ చేతులమీదుగా ఇళ్ల పట్టాలిచ్చాం. కేంద్రం తొలిదఫాగా 47వేల ఇళ్లను మంజూరు
చేసింది. రెండో దశలో మరో 3వేల ఇళ్లు మంజూరవుతాయి. ఇప్పటికే ల్యాండ్
లెవెలింగ్ కోసం సీఆర్డీఏకి రూ.30కోట్లు ఇచ్చాం. గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల
కలెక్టర్లతో సమావేశం జరుగనుంది. తాగునీరు, విద్యుత్, డ్రైనేజ్ తదితర మౌలిక
సదుపాయాల కల్పనపై నిర్ణయాలు తీసుకుంటాం. లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాల జారీ
సహా మ్యాపింగ్, జియో ట్యాగింగ్, షేర్వాల్ టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణాలు
చేపడతాం. దశలవారీగా ఆరు నుంచి 9 నెలల్లో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేస్తాం’ అని
స్పష్టం చేశారు.