న్యూ ఢిల్లీ : నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా తెలుగు అధికారి బీవీఆర్
సుబ్రహ్మణ్యం నియమితులయ్యారు. పరమేశ్వరన్ అయ్యర్ స్థానంలో ఆయన బాధ్యతలు
చేపట్టనున్నారు. ప్రపంచ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా అయ్యర్
వెళ్లనున్నారు. నీతి ఆయోగ్ సీఈవోగా రెండేళ్లు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే
వరకు సుబ్రహ్మణ్యం కొనసాగుతారు. బీవీఆర్ సుబ్రహ్మణ్యం పూర్తి పేరు భమిడిపాటి
వెంకట రామసుబ్రహ్మణ్యం. ఈయన తండ్రిది ఒడిశాలోని గుణుపురం కాగా, తల్లి
ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడకు చెందినవారు. విశాఖపట్నం, చెన్నై, హైదరాబాద్,
ఢిల్లీలో చదువుకున్నారు. ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో మెకానికల్
బ్రాంచ్ లో బీటెక్ చేశారు. లండన్ బిజినెస్ స్కూల్ నుంచి ఎంబీఏ పట్టా కూడా
పొందారు. బీవీఆర్ సుబ్రహ్మణ్యం 1987 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. 2004-2008,
2012-2015 మధ్య ప్రధానమంత్రులు మన్మోహన్ సింగ్, నరేంద్ర మోదీ హయాంలో కేంద్ర
వాణిజ్య శాఖ కార్యదర్శిగా పనిచేశారు. జమ్మూకశ్మీర్ ప్రధాన కార్యదర్శిగా,
ప్రధానమంత్రి కార్యాలయంలో డైరెక్టర్ గా, జాయింట్ సెక్రటరీగా విధులు
నిర్వర్తించారు. లాల్‌బహదూర్‌శాస్త్రి ఐఏఎస్ అకాడమీకి డిప్యూటీ డైరెక్టర్‌గా
కూడా సేవలందించారు.