వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి
న్యూఢిల్లీ : నూతన పార్లమెంటు భవనంతో భారత ప్రజాస్వామ్యానికి కొత్త బలం వచ్చి
చేకూరుతుందని, పార్లమెంటు ప్రజాస్వామ్యానికి ఆలయమని రాజ్యసభ సభ్యులు,
వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయి రెడ్డి అన్నారు. ఈ
మేరకు శనివారం సోషల్ మీడియా వేదికగా ఈ అంశానికి సంబందించి అనేక విషయాలు
వెల్లడించారు.
అలాగే భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య చరిత్రలో 2023 మే 28 ఆదివారం మరచిపోలేని
రోజుగా మిగిలిపోతుందని, 1927 నుంచి ఉపయోగిస్తున్న ప్రస్తుత పార్లమెంటు భవనం
పక్కనే నిర్మించిన కొత్త సన్సద్ భవన్ ప్రారంభమౌతున్న సందర్భం దేశ చరిత్రలో
చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు. లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ఆహ్వానంపై
ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తున్న ఈ కొత్త విశాల, అధునాతన భవంతి భావి
తరాలు, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా నిర్మించారు. అత్యంత ఆధునిక సాంకేతిక
పరిజ్ఞానంతో 2020 డిసెంబర్ 10న మొదలైన ఈ త్రిభుజాకార భవనం నిర్మాణం 2023 మే
20న పూర్తయింది. ఆదివారం ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని
అన్నారు. బ్రిటిష్ వారి హయాంలో పాత సన్సద్ భవన్ నిర్మాణానికి దాదాపు
ఆరేళ్లు పట్టిందని, కొత్త భవనం నిర్మాణం రికార్డు స్థాయిలో మూడేళ్ల లోపే
పూర్తయిందని తెలిపారు. సెంట్రల్ విస్టా రీడెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగంగా
65 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో కొత్త భవనం నిర్మించారు. గతంలో చేసిన
రాజ్యాంగ సవరణ చట్టం వల్ల 2026 తర్వాత జరిగే జనాభా లెక్కల సేకరణ ప్రాతిపదికగా
దేశంలో నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని అన్నారు. అప్పుడు పెరిగే
పార్లమెంటు సభ్యుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని కొత్త భవనాన్ని ఎక్కువ మంది
కూర్చుని విధులు నిర్వర్తించే విధంగా మరింత విశాలంగా తీర్చిదిద్దారని
పేర్కొన్నారు. కొత్త భవనంలోని లోక్ సభ సభ్యులు సమావేశమయ్యే చాంబర్లో 888
మంది, రాజ్యసభ చాంబర్లో 384 మంది సభ్యులు కూర్చోవడానికి అనువుగా ఏర్పాట్లు
చేశారు. ఇంకా లోక్ సభ చాంబర్లో ఉభయ సభల సంయుక్త సమావేశం నిర్వహిస్తే మొత్తం
1272 మంది సభ్యులు కూర్చుని విధులు నిర్వర్తించడానికి వీలు కల్పించారని
అన్నారు. ఇదివరకు సంయుక్త సమావేశాలు పాత భవనంలోని సెంట్రల్ హాలులో
నిర్వహించేవారు అయితే అక్కడ కేవలం 440 మంది కూర్చోవడానికే అవకాశముండేదని
చెప్పారు. రూ.862 కోట్ల వ్యయంతో 4 అంతస్తులు, 39.6 మీటర్ల ఎత్తులో ఈ కొత్త
భవంతిని కేంద్ర ప్రజా పనుల శాఖ నిర్మించింది. కొత్త సహస్రాబ్ది, శతాబ్ది మొదటి
పాతికేళ్ల చివరిలో ప్రారంభమౌతున్న నూతన పార్లమెంటు భవనం భారత ప్రజాతంత్ర
వ్యవస్థ మరింత సుస్థిరం, బలోపేతం కావడానికి దోహదం చేస్తుందనడంలో ఎలాంటి సందేశం
లేదని అన్నారు. ‘గోడలు, పైకప్పు పగుళ్లతో అత్యవసర పరిస్థితికి అవసరమైన
ఏర్పాట్లు లేక పార్లమెంట్ హౌస్ (పాతది) మౌనంగా రోధిస్తోంది అంటూ 2012లో నాటి
లోక్ సభ స్పీకర్ మీరా కుమార్ బాధపడిన పదేళ్లకే నూతన భవనంలోకి ఉభయసభలు
తరలిపోవడం నిజంగా సంతోషదాయకమని విజయసాయి రెడ్డి తెలిపారు.
ప్రజాస్వామ్యానికి ఆలయం పార్లమెంటు
ప్రజాస్వామ్యానికి ఆలయమైన పార్లమెంటు మన జాతి ఆత్మకు ప్రతిరూపమని విజయసాయి
రెడ్డి అన్నారు. ఇది భారత ప్రజలందరికీ, అన్ని రాజకీయపక్షాలకు చెందుతుందని
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాటలు అక్షర
సత్యాలని అన్నారు. అత్యంత సుందరమైన, విశాలమైన నూతన పార్లమెంటు భవనం
ప్రారంభోత్సవాన్ని కొన్ని పార్టీలు బహిష్కరించడం సబబు కాదనీ, ఈ పవిత్ర
కార్యక్రమానికి అందరూ హాజరుకావాలన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సలహా
సర్వజనులూ పాటించాల్సినంత ముఖ్యమైనదని అన్నారు. నూతన సన్సద్ భవన్ ప్రారంభం
కావడం భారత ప్రజలందరికీ గర్వకారణం. ప్రజాతంత్ర పంథాలో పయనిస్తున్న 140 కోట్ల
ప్రజలకు ఇది ఒక కొత్త పండగ. నూరేళ్లకు ఒకసారి వచ్చే ఇలాంటి ఉత్సవంలో భారత
ప్రాతినిధ్య పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో భాగస్వాములైన అన్ని పార్టీలు,
ఎంపీలు, నాయకులు పాల్గొనడం ఆనందదాయకం. 1950 జనవరి 26న అమలులోకి వచ్చిన
రాజ్యాంగం పరిధిలో పయనించే భారత ప్రజాస్వామ్య వ్యవస్థ అసలు పట్టుమని
పదేళ్లయినా కొనసాగుతుందా? అంటూ కొందరు పాశ్చాత్య మేధావులు వెలిబుచ్చిన
అనుమానాలను భారత ప్రజలు పటాపంచలు చేశారని అన్నారు. ప్రజాస్వామ్యం మూకస్వామ్యం
కాదని, ప్రజలందరి సంక్షేమం కోసం నడిచేదని, అందరి స్వేచ్ఛాస్వాతంత్య్రాలను
కాపాడేదని ప్రజలు, రాజకీయ పార్టీల నేతలు నిరూపించారు. డా.రాజేంద్ర ప్రసాద్,
పండిత నెహ్రూ, డా.బీఆర్ అంబేడ్కర్ సహా రాజ్యాంగకర్తల ఆశలు, ఆశయాలకు
అనుగుణంగా భారతీయులు నడుచుకుంటూ ఈ 73 ఏళ్లలో ప్రజాస్వామ్యాన్ని తమ జీవన
విధానంగా మార్చుకున్నారు. నూతనోత్సాహంతో పరుగులు తీస్తున్న భారత
ప్రజాస్వామ్యానికి కొత్త పార్లమెంటు భవనం వాహకంగా, ఆలయంగా నిలుస్తుందని
అన్నారు. ప్రజాస్వామ్యం కలకాలం పచ్చగా వర్ధిల్లడానికి సువిశాల భారతం
సానుకూలమైన, సారవంతమైన నేల అని భారత పౌరులు నిరూపించారని పేర్కొన్నారు. నూతన
పార్లమెంటు భవనం ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత ముందుకు నడిపించడంలో తన వంతు
పాత్ర పోషిస్తుందని మనం ధైర్యంగా చెప్పవచ్చని విజయసాయి రెడ్డి చెప్పారు.