హైదరాబాద్: యూఎస్ కాన్సులేట్ తమ కార్యకలాపాలను ఇక నుంచి నానక్‌రామ్‌గూడ నుంచి
నిర్వహించనుంది. ఈ నెల 20న నూతన కాన్సులేట్ భవనం ప్రారంభం కానుంది. 340
మిలియన్ డాలర్ల పెట్టుబడితో నిర్మించిన ఈ అత్యాధునిక భవనం అమెరికా – భారత్‌ల
మధ్య బలపడుతోన్న వ్యూహాత్మక భాగస్వామ్యానికి నిదర్శనమని, ఈ సందర్భంగా అందించే
వివిధ సేవల వివరాలను యూ.ఎస్. కాన్సులేట్ జనరల్ ప్రకటించింది. బేగంపేట్ పైగా
ప్యాలెస్‌లో ఈ నెల 15 వరుకు సేవలు కొనసాగనున్నాయి. ఆ రోజు మధ్యాహ్నం 12 గంటల
నుంచి 20వ తేదీ 8.30 గంటల వరకు కార్యకలాపాలను నిలిపివేస్తున్నామని కాన్సులేట్
జనరల్ వెల్లడించింది. అయితే మార్చి 20 ఉదయం 08:30 వరకు అత్యవసర సేవలకు
అమెరికా పౌరులు, +91 040-4033 8300 నంబర్‌పై సంప్రదించాలని యూఎస్ కాన్సులేట్
పేర్కొంది. మార్చి 20 ఉదయం 08:30 తర్వాత, అత్యవసర సేవలకు అమెరికా పౌరులు 91
040 6932 8000 నంబర్‌పై సంప్రదించాలని తెలిపింది. అత్యవసరం సేవలకు అమెరికా
పౌరులు HydACS@state.gov కి ఈ- మెయిల్ కూడా చేయవచ్చని పేర్కొంది.
మార్చి 15 వరకు వీసా ఇంటర్వ్యూ ఉన్న దరఖాస్తుదారులు బేగంపేట్‌లోని పైగా
ప్యాలెస్‌లో సంప్రదించాలని, మార్చి 23 నుండి వీసా దరఖాస్తుదారులు ఇంటర్వ్యూ
కోసం నానక్‌రామ్‌గూడలోని నూతన కార్యాలయానికి వెళ్లాలని కాన్సులేట్ జనరల్
సూచించింది. బయోమెట్రిక్స్ అపాయింట్మెంట్లు, “డ్రాప్‌బాక్స్”
అపాయింట్మెంట్లు (ఇంటర్వ్యూ మినహాయింపు ఉన్నవారు), పాస్‌పోర్ట్ పికప్ సహా
ఇతర వీసా సేవలు – లోయర్ కాంకోర్స్, హైటెక్ సిటీ మెట్రో స్టేషన్, మాధాపూర్,
హైదరాబాద్ 500081, లో ఉన్న వీసా అప్లికేషన్ సెంటర్ లో కొనసాగుతాయి.
కాన్సులేట్ మార్పు ప్రక్రియ వల్ల వీసా అప్లికేషన్ సెంటర్ సేవలపై ఎలాంటి
ప్రభావం ఉండదని కాన్సులేట్ జనరల్ వివరించింది. వీసా సేవలకి సంబంధించి
మీకేమైనా సందేహాలుంటే, +91 120 4844644, +91 22 62011000పై కాల్ చేయాలి.
నానక్‌రామ్‌గూడ కాన్సులేట్ బదిలీ సమాచారం కోసం కాన్సులేట్ సోషల్ మీడియా
అకౌంట్లను ఫాలో అవ్వాలని కాన్సులేట్ జనరల్ పేర్కొంది. Twitter
(@USAndHyderabad), Instagram (@USCGHyderabad), Facebook
(@usconsulategeneralhyderabad)