విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాం
బోగస్ వర్సిటీలపై కొరడా
తెలంగాణ ప్రభుత్వ సానుకూల ధోరణి పారిశ్రామికవేత్తలను ఆకట్టుకుంటోందని కితాబు
హైదరాబాద్: ‘‘తొలిసారి అమెరికా వెళ్లేందుకు వీసాల కోసం ఎదురుచూస్తున్న వారికి వచ్చే ఏడాది స్లాట్లు అందుబాటులోకి వస్తాయి. విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రస్తుతం విద్యార్థి వీసాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చాం. పర్యాటక వీసాల పునరుద్ధరణకు డ్రాప్ బాక్స్ సౌకర్యం అందుబాటులో ఉంది. నేరుగా ఇంటర్వ్యూలకు రావాల్సిన అవసరం లేదు. నూతన కాన్సులేట్ వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్‌లో ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో పరిశ్రమల స్థాపనకు అవకాశాలున్నాయి. తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న సానుకూల ధోరణి పారిశ్రామికవేత్తలను ఆకట్టుకుంటోంది’’ అని హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ ప్రత్యేక ఇంటర్వ్యూలో వివరించారు.
పర్యాటక వీసాల పరిస్థితులు ఎప్పటికి మెరుగవుతాయి?
వచ్చే ఏడాది నుంచి పరిస్థితులు సానుకూలంగా ఉంటాయి. తొలి దశలో పర్యాటక వీసా స్లాట్లు అందుబాటులోకి తెచ్చేందుకు మా వంతు ప్రయత్నాలు చేస్తున్నాం. స్లాట్లు లేకపోవటం ఒక్క హైదరాబాద్ కాన్సులేట్ పరిధిలోనే కాదు… దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి. కరోనా తరవాత వీసా ప్రక్రియ ప్రారంభం నుంచి కార్యాలయాల్లో పరిమిత సిబ్బందే ఉన్నారు. వీసా జారీని పెంచేందుకు చైనా, మధ్యప్రాచ్య దేశాల్లోని అమెరికా కార్యాలయాల సిబ్బంది ఇక్కడికి వచ్చి పని చేస్తున్నారు. వచ్చే ఏడాది జూన్‌కు కరోనా ముందునాటి స్థాయిలో సిబ్బంది అందుబాటులో ఉంటారు.
హైదరాబాద్‌లో కాన్సులేట్ ఉండి కూడా చాలా మంది తెలుగు విద్యార్థులు చెన్నై, ముంబయి, దిల్లీలలోని కాన్సులేట్స్‌కు ఎందుకు వెళ్లాల్సి వస్తోంది?
కేంద్రీకృత వ్యవస్థ ద్వారా వీసా స్లాట్లు జారీ అవుతాయి. కాన్సులేట్ వారీగా ఉండదు. స్లాట్లు విడుదల కాగానే ఎవరు ముందు ప్రయత్నిస్తే వారికే అవకాశం లభిస్తుంది.
అమెరికాలో చదువుకునే భారతీయ విద్యార్థులకు ఎలాంటి రక్షణ ఉంటుంది?
విద్యార్థుల రక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుంది. తరగతుల ప్రారంభానికి ముందుగానే అమెరికాలోని పరిస్థితులపై అవగాహన కల్పిస్తాం. క్యాంపస్ పోలీసులకు సంబంధించిన సమాచారాన్ని అందజేస్తాం. బోగస్ విశ్వవిద్యాలయాలపై చాలా కఠినంగా వ్యవహరిస్తాం. గతంలో కొన్ని మూసివేశాం.
నూతన కాన్సులేట్ కార్యాలయ ప్రారంభానికి అమెరికా అధ్యక్షుడు వచ్చే అవకాశం ఉందా?
అమెరికా అధ్యక్షుడిని ఆహ్వానించేందుకు సమయం సరిపోదు. ఏడాది ముందుగా ఆయన పర్యటనలు ఖరారవుతాయి. కాన్సులేట్ కొత్త కార్యాలయ పనులు దాదాపు పూర్తయ్యాయి. కొన్ని అనుమతులు తీసుకునేందుకు అమెరికా నుంచి అధికారులు రావాల్సి ఉంది. మార్చి లేదా ఏప్రిల్‌లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని నూతన కాన్సులేట్ భవనం ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నాం.
యూఎస్ఎయిడ్ కార్యాలయం ఇక్కడ ఏర్పాటవుతుందా?
యూఎస్ఎయిడ్(ద యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్) విభాగం ఇప్పటి వరకు దిల్లీ కేంద్రంగా పని చేస్తోంది. త్వరలో ఓ అధికారి హైదరాబాద్ నుంచి పని చేస్తారు. యూఎస్ఎయిడ్ ఈ కాన్సులేట్ పరిధిలో చాలా ప్రాజెక్టులను నిర్వహిస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌లో కాన్సులేట్ ఏర్పాటు చేసే అవకాశం ఉందా?
ప్రస్తుతానికి అలాంటి ఆలోచనేదీ లేదు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు వెళ్లిన సందర్భాల్లో పారిశ్రామికవేత్తలు సహా అందరూ అడుగుతున్నారు.
ఉభయ దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో వాణిజ్యం ఎలాంటి పాత్ర పోషిస్తోంది?
గడిచిన 20 సంవత్సరాల్లో రెండు దేశాల మధ్య వాణిజ్యం ఎనిమిది రెట్లు పెరిగింది. ప్రస్తుతానికి 159 బిలియన్ డాలర్ల స్థాయికి చేరింది. గూగుల్, అమెజాన్, డెల్లాయిట్ లాంటి సంస్థలు అమెరికా వెలుపల అతి పెద్ద వ్యవస్థలను హైదరాబాద్‌లోనే ఏర్పాటు చేశాయి.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు అమెరికా పరిశ్రమలేమైనా వస్తున్నాయా?
తెలుగు రాష్ట్రాల్లో పరిశ్రమల స్థాపనకు అమెరికాలోని పారిశ్రామికవేత్తలు ఉత్సాహాన్ని చూపుతున్నారు. ప్రత్యేకించి తెలంగాణలో పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చాలా సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తోంది. పరిశ్రమలకు సత్వర అనుమతులు మొదలు కావాల్సిన అన్ని సౌకర్యాలనూ ఈ ప్రభుత్వం కల్పిస్తోంది. ఏవియేషన్ రంగానికి చెందిన 16 మందికిపైగా పారిశ్రామికవేత్తలు హైదరాబాద్ వచ్చి వెళ్లిన తరవాత వారి నుంచి నాకు పెద్ద సంఖ్యలో ఫీడ్‌బ్యాక్ మెయిల్స్ వచ్చాయి. పరిశ్రమల స్థాపనకు హైదరాబాద్‌లో సానుకూల పరిస్థితులున్నాయని, ప్రభుత్వ ప్రోత్సాహకాలు అనుకూలంగా ఉన్నాయని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే వందకుపైగా అమెరికా పరిశ్రమలు ఉన్నాయి.