అంబులెన్స్‌లను క్యాంపు కార్యాలయం వద్ద సీఎం వైయస్.జగన్ మోహన్ రెడ్డి
లాంఛనంగా జెండా ఊపి ప్రారంభించారు. కొత్త 108 వాహనంలో వైద్య పరికరాలు,
సౌకర్యాలను ముఖ్యమంత్రి పరిశీలించారు. 108 అంబులెన్స్ సేవలను మరింత బలోపేతం
చేసేలా సీఎం జగన్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 146 కొత్త
అంబులెన్స్‌లను కొనుగోలు చేసింది. ఈ అంబులెన్స్‌లను సోమవారం సీఎం వైఎస్
జగన్ తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం వద్ద ప్రారంభించారు. 108 వ్యవస్థను
బలోపేతం చేస్తూ 2020లోనే మండలానికి ఒక 108 అంబులెన్స్‌ను సమకూర్చిన విషయం
తెలిసిందే. ఇందులో భాగంగా అప్పట్లో రూ.96.50 కోట్లతో అధునాతన సౌకర్యాలతో 412
కొత్త అంబులెన్స్‌లు కొనుగోలు చేసి, అప్పటికే ఉన్నవాటికి మరమ్మతులు చేసి 748
అంబులెన్స్‌లతో సేవలను విస్తరించారు. గత అక్టోబర్‌లో రాష్ట్రంలోని గిరిజన
ప్రాంతాల ప్రజల కోసం రూ.4.76 కోట్లతో ప్రత్యేకంగా 20 అదనపు అంబులెన్సులు
కొనుగోలు చేశారు. దీంతో రాష్ట్రంలో అంబులెన్సుల సంఖ్య 768కి చేరింది.
ఎక్కువకాలం ప్రయాణించి దెబ్బతిన్నస్థితిలో ఉన్నవాటి స్థానంలో కొత్త
అంబులెన్సులను ప్రవేశపెట్టడం కోసం తాజాగా రూ.34.79 కోట్లతో 146 అంబులెన్స్‌లను
ప్రభుత్వం కొనుగోలు చేసింది. మరోవైపు 108 సేవల కోసం ఏటా ప్రభుత్వం రూ.188.56
కోట్లు ఖర్చు చేస్తోంది. ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా గత టీడీపీ
ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుతం సేవలు ఎంతో మెరుగుపడ్డాయి. అప్పట్లో 1.19
లక్షల మందికి ఒక అంబులెన్స్ ఉండగా ప్రస్తుతం 74,609 మంది జనాభాకు ఒక
అంబులెన్స్ ఉంది.
సేవలు వినియోగించుకున్న 33,35,670 మంది : ప్రస్తుతం రాష్ట్రంలో 108
అంబులెన్స్‌లు రోజుకు 3,089 కేసులకు అటెండ్ అవుతున్నాయి. ఇలా 2020 జూలై నుంచి
ఇప్పటి వరకు 33,35,670 ఎమర్జెన్సీ కేసుల్లో అంబులెన్స్‌లు సేవలందించాయి.
సేవలు వినియోగించుకున్న వారిలో అత్యధికంగా 23%మంది మహిళలే. అనంతరం 12% మంది
కిడ్నీ సంబంధిత సమస్యలున్నవారు, 11% మంది రోడ్డు, ఇతర ప్రమాదాల బాధితులు
ఉన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని, మహిళా శిశు
సంక్షేమశాఖ మంత్రి కె వి ఉషాశ్రీచరణ్, రహదారులు, భవనాలశాఖ మంత్రి దాడిశెట్టి
రామలింగేశ్వరరావు(రాజా), ఎంపీ నందిగాం సురేష్, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ సీఎస్
ఎం టి కృష్ణబాబు, పలువురు ఇతర ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.