లండన్ : గత ఏడాది చివర్లో బ్రిటన్ ప్రధానిగా నియమితులైన రిషి సునాక్‌కు
ప్రజల్లో ఆదరణ తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. ఆ పదవి చేపట్టిన తర్వాత
మొదటిసారిగా ఆయన నెలవారీ సర్వేలో నెగెటివ్ ఆమోద రేటింగ్‌ను పొందారు.
కన్జర్వేటివ్ హోం పోల్‌లో ఈ విషయం వెల్లడైంది. గత నెల సునాక్ రేటింగ్ 11.7
శాతంగా ఉండగా.. ఇప్పుడు అది -2.7కు పడిపోయింది. ప్రధాని పదవి స్వీకరించిన
సమయంలో ఆయన ఆమోద రేటు 49.9 శాతంగా ఉంది. శరణార్థులను రువాండాకు పంపే
ప్రణాళికకు కోర్టులో ఎదురుదెబ్బ తగలడం, అలాగే వడ్డీ రేట్లను ఐదు శాతం
పెంచాలన్న ఇంగ్లండ్ బ్యాంక్ నిర్ణయం కూడా ఇందుకు కారణంగా కనిపిస్తోంది.
అయితే సునాక్‌కు ఊరటనిచ్చే విషయం ఏంటంటే.. రేటింగ్ పరంగా మాజీ ప్రధానులు
బోరిస్ జాన్సన్, థెరిసా మే కంటే ఆయన మెరుగ్గా ఉన్నారు. ఒక దశలో జాన్సన్
రేటింగ్ -33.8కి తగ్గగా, థెరిసా మే రేటింగ్ -51.2కి పడిపోయింది. సునాక్‌తో
పాటు మరో ఎనిమిది మంది కేబినెట్ సహచరులకూ నెగెటివ్ రేటింగే వచ్చింది. అయితే
రక్షణ శాఖ మంత్రి బెన్ వాల్లెస్కు అత్యధిక ఆమోద రేటింగ్(77.1 శాతం)
లభించింది. విదేశాంగ మంత్రి జేమ్స్ క్లెవర్లీ(54.4), హోం మంత్రి సుయెల్లా
బ్రేవర్మన్(30.4) రేటింగ్ విషయంలో సునాక్ కంటే ఎంతో మెరుగ్గా ఉన్నారు.