ఇంద్రధనస్సులో రంగులన్నీ కీలకమే : రాజ్‌నాథ్
న్యూఢిల్లీ : భారత తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూకు పదహారేళ్లు
అధికారిక నివాసంగా ఉన్న తీన్‌మూర్తి భవన్లో ఏర్పాటుచేసిన నెహ్రూ మెమోరియల్
మ్యూజియం అండ్ లైబ్రరీ సొసైటీ పేరును ప్రధానమంత్రుల మ్యూజియంగా మారుస్తూ
కేంద్రం నిర్ణయం తీసుకుంది. సొసైటీ ఉపాధ్యక్షుడిగా ఉన్న రక్షణశాఖ మంత్రి
రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో మ్యూజియం పేరు
మార్చాలని నిర్ణయించినట్లు సాంస్కృతిక శాఖ వెల్లడించింది. ‘నెహ్రూ నుంచి మోదీ
వరకు ఎంతోమంది ప్రధానులు చేసిన సేవలు, వారు ఎదుర్కొన్న సవాళ్లకు సంబంధించి
అన్ని విషయాలను ఈ మ్యూజియం తెలియజేస్తుంది. అందుకే దీని పేరు మారుస్తూ చేసిన
ప్రతిపాదన స్వాగతించదగినది’ అని రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు.
ప్రధానమంత్రులంటే ఓ వ్యవస్థ అని అభివర్ణించిన ఆయన.. అందరు ప్రధానుల
ప్రయాణాన్ని ఇంద్రధనస్సుతో పోల్చారు. అది అందంగా ఉండాలంటే ఇంద్రధనస్సులోని
రంగులన్నీ సమపాళ్లలో ఉండాలని అభిప్రాయపడ్డారు.
చరిత్ర లేనివారే ఇలా చేస్తారు : కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే
నెహ్రూ పేరుతో దశాబ్దాలుగా కొనసాగుతున్న మ్యూజియం పేరును మార్చడం అల్పబుద్ధికి
నిదర్శనమని కాంగ్రెస్ పార్టీ మండిపడింది. భవనాల పేరు మార్చినంత మాత్రాన
వ్యక్తుల వైభవం చెరిగిపోదని తెలిపింది. ఎటువంటి చరిత్ర లేనివారే ఇతరుల
చరిత్రను చెరిపేస్తారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే
విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ చర్యతో ఆధునిక భారత నిర్మాత అయిన నెహ్రూ
ప్రతిష్ఠ ఎంతమాత్రం తగ్గదని ఆయన ట్వీట్ చేశారు. 59 ఏళ్లకు పైగా అంతర్జాతీయ
మేధో భాండాగారంగా, ఎన్నో విలువైన పుస్తకాలకు నిలయంగా ఉన్న మ్యూజియం పేరు
మార్చడం సంకుచిత మనస్తత్వానికి ప్రతీకగా కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్
విమర్శించారు.
కాంగ్రెస్‌కు రాజకీయ అజీర్తి : బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా
వారసత్వ రాజకీయాలకు మించి కాంగ్రెస్ పార్టీ ఆలోచించలేదని చెప్పేందుకు నెహ్రూ
మ్యూజియం పేరు మార్పును వారు జీర్ణం చేసుకోకపోవడం గొప్ప ఉదాహరణగా బీజేపీ జాతీయ
అధ్యక్షుడు జేపీ నడ్డా ట్వీట్ చేశారు.
93 ఏళ్ల తీన్‌మూర్తి భవన్ : బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో రాబర్ట్ టోర్ రసెల్
అనే ఆర్కిటెక్ట్ 1929-30 ప్రాంతంలో దిల్లీ నడిబొడ్డున ఈ భవనాన్ని
నిర్మించారు. అప్పట్లో ఫ్లాగ్‌స్టాఫ్ హౌస్‌గా పిలిచిన ఈ భవనాన్ని బ్రిటిష్
ఆర్మీ కమాండర్ ఇన్ చీఫ్ నివాసం కోసం కేటాయించారు. 1947లో భారత్‌కు
స్వాతంత్య్రం వచ్చాక ‘తీన్‌మూర్తి భవన్’గా పేరు మార్చి తొలి ప్రధాని నెహ్రూ
1964 మే 27న ఆయన మరణించేదాకా పదహారేళ్లకు పైగా ఇందులో నివసించారు. ఆ తర్వాత
దీన్ని నెహ్రూ స్మారక మ్యూజియంగా మారుస్తూ అదే ఏడాది నవంబర్ 14న రాష్ట్రపతి
ఎస్.రాధాకృష్ణన్ ప్రకటించారు. ఈ భవనం ముందున్న రాతిస్తంభం చుట్టూ బల్లెం
చేతబూనిన ముగ్గురు సైనికుల కాంస్య విగ్రహాలు ఉంటాయి. 1918 నాటి మొదటి
ప్రపంచయుద్ధంలో వీరోచితంగా పోరాడిన జోధ్‌పుర్, హైదరాబాద్, మైసూర్ దళాల
స్మారకార్థం వీటిని ఏర్పాటు చేశారు.