సమస్యలు పరిష్కరించే వరకు ఉద్యమం ఆగదు
ఇప్పటివరకు ప్రభుత్వానికి సహకరించాం…సమయమిచ్చాం
వాయిదాల మీద వాయిదాలే తప్ప సమస్యలు పరిష్కారం కాలేదు
తాజా సమావేశంలో కూడా వాయిదాలే
గత 5 దశాబ్దాల కాలంలో ఇటువంటి పరిస్థితి ఏ ప్రభుత్వంలోనూ లేదు
ఎన్టీఆర్ జిల్లా ఎన్జీవోస్ అసోసియేషన్ అధ్యక్షులు ఎ. విద్యాసాగర్
విజయవాడ : ప్రభుత్వ ఉద్యోగులకు న్యాయంగా రావాల్సిన బకాయిలను సత్వరమే చెల్లించాలని, ఉద్యోగులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను నిర్ణీత సమయంలో పరిష్కరించాలని గత నాలుగేళ్లుగా ప్రభుత్వానికి వివిధ రూపాల్లో విజ్ఞప్తి చేశాం. కానీ మాతో సమావేశం అయిన ప్రతీసారీ వాయిదాలే తప్ప పురోగతి లేదు. ఇకనుంచి మా ఉద్యోగ వర్గాల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమం చేసేందుకే సిద్ధమయ్యామని ఎన్టీఆర్ జిల్లా ఎన్జీవోస్ అసోసియేషన్ అధ్యక్షులు
ఎ. విద్యాసాగర్ అన్నారు.
గాంధీనగర్ లోని ఎన్జీవో భవన్లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం వల్ల ఉద్యోగులు ఎదుర్కొంటున్న
సమస్యలను వివరించారు. ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్ల సాధన కోసం మా పోరాటం కొనసాగుతుందన్నారు. గతంలో ప్రకటించిన ఉద్యమ కార్యాచరణ యధావిధిగా కొనసాగుతుందన్నారు. ఇందులో భాగంగా
బుధవారం నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరవుతామన్నారు.
తహసిల్దారు, సబ్ కలెక్టర్, కలెక్టర్లకు వినతి పత్రాలు సమర్పణ, 15, 16 తేదీల్లో నల్ల బ్యాడ్జీలు ధరించి మధ్యాహ్నం భోజన విరామ సమయంలో తాలూకా కేంద్రాలు, పాఠశాలల్లో నిరసన కార్యక్రమాలు, 17వ తేదీన తాలూకా కేంద్రాల్లో ర్యాలీలు, ధర్నా చేపట్టడం, 20వ తేదీన జిల్లా కలెక్టరేట్ల వద్ద ర్యాలీ, ధర్నా నిర్వహణ, 21 నుంచి 24 వరకు రాష్ట్ర నాయకులు అన్ని జిల్లాల్లో పర్యటించి 27వ తేదీన చేపట్టనున్న “చలో విజయవాడ”కు ఉద్యోగులను సిద్ధం చేస్తామని చెప్పారు. ఈసారి జరిగే ఉద్యమం ద్వారా ఇప్పటివరకు అపరిష్కృతంగా ఉన్న అన్ని సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు విశ్రమించేది లేదన్నారు. ప్రభుత్వం చర్చలకు పిలిచిన ప్రతిసారి కేవలం మాటలే తప్ప ఒక్క సమస్యను కూడా సంపూర్ణంగా పరిష్కరించలేదన్నారు. తాజాగా మంత్రుల బృందంతో జరిగిన సమావేశంలో కూడా బృందంలోని మంత్రులు కొత్త వాయిదాలు కోరారే గాని పాత వాయిదాల గురించి ప్రస్తావన లేకుండా మాట్లాడటం వల్ల ఉద్యోగులకు ఒరిగిందేమీ లేదన్నారు. ఉద్యోగులు కూడా గొంతెమ్మకోరికలేమీ కోరడం లేదన్నారు. ఏ ప్రభుత్వంలోనూ లేని విధంగా ఈ ప్రభుత్వం 11 సార్లు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలు నిర్వహించింది. కానీ ఉద్యోగులకు ఎటువంటి ప్రయోజనం లేని చర్చలను ఎన్నిసార్లు జరిపినా నిష్ఫలమన్నారు. నిన్న జరిగిన సమావేశంలో కూడా ఉద్యోగుల సొమ్ము ప్రభుత్వం వద్ద ఎంతుందో కూడా తెలియని అయోమయ స్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. మా డీఏలు, పీఆర్సీ మాట దేవుడెరుగు. కనీసం మా జిపిఎఫ్ నిధులు ఎంత పెండింగ్ ఉన్నాయన్నది తెలపడం లేదన్నారు. ఉద్యోగ సంఘాల లెక్క ప్రకారం డీఏ బకాయిలు 8 వేల కోట్లు, పీఆర్సీ ఎరియర్స్ 7 వేల కోట్లు ఉన్నాయి. ఉన్నాయని ప్రభుత్వానికి గణాంకాలు వివరించా మన్నారు.
ఉద్యోగులకు హక్కుగా రావలసిన డి ఎ బకాయిలను గత ఐదేళ్లలో ఒక్క డీఎ బకాయి కూడా ఉద్యోగుల ఖాతాలో జమ చేయ లేదన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఉద్యోగుల జీతభత్యాల కోసం ప్రకటించే పి ఆర్ సి లో కూడా ఉద్యోగులకు అన్యాయం చేసిన చరిత్ర స్వాతంత్రానంతరం ఏ రాష్ట్రంలోనూ లేదన్నారు. ప్రతి పి ఆర్ సి లోను సాధారణంగా జీతభత్యాల పెంపు ఉంటుందన్నారు. కానీ ఈ ప్రభుత్వం మాత్రం పెంచకపోగా తగ్గించిందని వివరించారు. రాష్ట్రంలోని ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులకు వలసిన బకాయిల సొమ్ము సుమారు 25 వేల కోట్ల రూపాయలు పైబడి రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉందన్నారు. తమ కుటుంబ అవసరాల కోసం ఉద్యోగులు లోన్స్ పెడితే తమకు సమయానికి డబ్బు చేతికందటం లేదని వివరించారు. ఇటువంటి దుస్థితి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొన్న చరిత్ర గతంలో ఇప్పుడు లేదన్నారు. తమ డబ్బులకు ట్రస్టీగా వ్యవహరించాల్సిన ప్రభుత్వం తన బాధ్యతను విస్మరించడం బాధాకరమన్నారు. ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులు తమ ఆరోగ్య అవసరాల కోసం ప్రతినెల చెల్లిస్తున్న వైద్య బీమా డబ్బులు సైతం ప్రభుత్వం ఆసుపత్రుల ఖాతాలకు జమ చేయకపోవడంతో ఆస్పత్రి యాజమాన్యాలు తమ అనారోగ్య సమస్యల సమయంలో వైద్యం చేసేందుకు నిరాకరిస్తున్నాయన్నారు. డిఏ తదితర బకాయిలు ఒక్కో ఉద్యోగికి కనీసం మూడు నుంచి నాలుగు లక్షల రూపాయల వరకు ప్రభుత్వం చెల్లించాల్సి ఉందన్నారు. సరెండర్ లీవ్ ల సొమ్ములు కూడా ప్రభుత్వం తనవద్దే ఉంచుకొని గత మూడు సంవత్సరాలుగా చెల్లించకుండా ఉద్యోగులను ఇబ్బంది పెడుతోంద న్నారు.8 వేల కోట్లకు పైగా సరెండర్ లీవుల డబ్బులు ప్రభుత్వం వద్ద ఉన్నాయన్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ వేగవంతం చేయాలని ప్రభుత్వానికి ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశామన్నారు. ఈ అంశంలో ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సంవత్సరాలు గడుస్తున్నాయే తప్ప ఒక్క ఉద్యోగికి కూడా బకాయిలు చెల్లించలేదన్నారు.
ప్రభుత్వానికి ప్రతి సంవత్సరం వెయ్యి కోట్ల పైగా సొమ్ము గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ కి ఉద్యోగులు చెల్లిస్తున్నప్పటికీ, సుమారు పదివేల కోట్ల మూలధనం ప్రభుత్వం దగ్గర ఉన్నప్పటికీ, ప్రభుత్వానికి ఒక్క పైసా కంట్రీ బ్యూషన్ లేకపోయినప్పటికీ.ఎ పి జి ఎల్ ఐ రుణాలు గాని, రిటైర్ అయితే చెల్లించడం గాని, చనిపోతే చెల్లించడం కానీ జరగటం లేదన్నారు. ఇంతకుమించిన విషయం ఏమిటంటే గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ కు సంబంధించిన పోర్టల్ కూడా గత ఆరునెలల కాలంగా మూసివేయటం శోచనీయమన్నారు. దీనివల్ల కనీసం లోన్లుగానీ, కొత్త బాండ్లు గానీ రిటైర్మెంట్ విషయంలో గానీ అప్లికేషన్ పెట్టుకోవడానికి కూడా సదుపాయం లేదని తెలిపారు.రిటైరైన ఉద్యోగికి జిపిఎఫ్ సొమ్ము కూడా చెల్లించక పోవడం వల్ల రిటైర్ అయిన ఉద్యోగులు తమ తమ కుటుంబాల ఆర్థిక పరిస్థితులను అధిగమించలేక తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి రావలసిన బకాయిల విషయం ఒక అంశం అయితే, ప్రతినెల నిర్ణీత సమయానికి జీతాలు, పెన్షన్ వచ్చే పరిస్థితి లేదన్నారు. కేంద్రం ప్రతి 6 నెలలకు కొత్త డీఎ ప్రకటిస్తుంటే, రాష్ట్రప్రభుత్వం కనీసం పాత డిఏలను కూడా ఉద్యోగులకు చెల్లించలేక పోతోందన్నారు. . సి పి ఎస్ కు ఉద్యోగుల నుంచి 10% మినహాయిస్తున్న ప్రభుత్వం, మరియొక 10 శాతం తమ వాటా కింద చెల్లించాలని, ఈ రెండిటినీ ప్రాన్ ఎకౌంట్కి జత చేయాల్సింది ఉండగా, కనీసం సిపిఎస్ ఉద్యోగులు కడుతున్న 10% అమౌంట్ కూడా సంవత్సర కాలంగా జమ చేయడం లేదన్నారు.
సిపిఎస్ రద్దు చేసి, ఓపిఎస్ పునరుద్ధరిస్తారని మాట ఇచ్చిన ప్రభుత్వం దానికి కట్టుబడక పోవటం శోచనీయమని చెప్పారు.
12వ పిఆర్సికి కమిషనర్ ని అపాయింట్ చేసినప్పటికీ గత ఎనిమిది నెలలుగా ఒక్క అడుగు కూడా ముందుకు పడని పరిస్థితి ఏర్పడిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యంతర భృతి రిలీఫ్ ను వెంటనే చెల్లించాల్సిన అవసరం ఉందన్నారు. ఇటువంటి ఇబ్బందికర పరిస్థితుల్లోనే ఉద్యోగ సంఘాలు ఉద్యమ బాటను ఎంచుకున్నాయన్నారు. ఉద్యోగులు, పెన్షనర్లు, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని తలపెట్టిన ఈ ఉద్యమం గతంలో ఉద్యోగ సంఘాలు నిర్వహించిన పోరాటాలకు ఏ మాత్రం తగ్గకుండా ఉంటుందన్నారు. సమావేశంలో జిల్లా జేఏసీ కన్వీనర్ ఎండి ఇక్బాల్, ఉపాధ్యాయ సంఘాల నుంచి
యు టి ఎఫ్ జిల్లా అధ్యక్షులు కె. శ్రీనివాసరావు, ఎ పి టి ఎఫ్ జిల్లా అధ్యక్షులు ఖాసిం, ఎన్టీఆర్ జిల్లా ఎస్టియు అధ్యక్షులు ఎస్.కె ఇమ్రాన్ సాహెబ్, పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు దాలి నాయుడు, విష్ణువర్ధన్ పబ్లిక్ సెక్టార్ ఉద్యోగుల సంఘం చైర్మన్ ఎ. సాంబశివరావు, ఐటిఐ ఉద్యోగుల అసోసియేషన్ ఉపాధ్యక్షులు కిషోర్ బాబు,
గ్రామ సచివాలయ ఉద్యోగుల సంఘం నాయకులు శశిధర్, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ బి. సతీష్ కుమార్.వైస్ ప్రెసిడెంట్ బి వి రమణ .విజయవాడ నగర శాఖ కార్యదర్శి సంపత్ కుమార్ మధుసూదనరావు మహిళా కార్యదర్శి కె .శివ లీల
ఏపీ జేఏసీలోని వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.