కేసీఆర్
హైదరాబాద్ : తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం రాష్ట్రవ్యాప్తంగా
‘తెలంగాణ హరితోత్సవం’ నిర్వహించనున్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం
నియోజకవర్గంలోని తుమ్మలూరు అర్బన్ ఫారెస్ట్పార్కులో ఉదయం జరిగే కార్యక్రమంలో
ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొని మొక్క నాటనున్నారు. ఈ పార్కులో దాదాపు 20
ఎకరాలను మొక్కలు నాటేందుకు సిద్ధం చేశారు. మంత్రి సబిత, ఇతర ప్రజాప్రతినిధులు
పాల్గొంటారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా సభ ఏర్పాటు చేశారు. హరితహారం
కార్యక్రమంలో భాగంగానే హరితోత్సవం నిర్వహించనున్నారు. తొమ్మిదో విడత
హరితహారంలో ఈ ఏడాది 19.29 కోట్ల మొక్కలు నాటాలన్నది లక్ష్యం. సోమవారం నాటి
కార్యక్రమంలో ప్రతిఒక్కరూ పాల్గొని పెద్దఎత్తున మొక్కలు నాటాలని అటవీశాఖ
మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పిలుపునిచ్చారు. అడవుల పరిరక్షణకు విశేష కృషి చేసిన
అటవీ అధికారులు, సిబ్బందిని రవీంద్రభారతిలో సన్మానించి, అవార్డులు
అందజేస్తామని ఆయన తెలిపారు. తుమ్మలూరు ఫారెస్ట్పార్కును సీఎస్ శాంతికుమారి,
అటవీ సంరక్షణ ప్రధాన అధికారి డోబ్రియాల్, లోకేశ్ జైశ్వాల్ తదితరులతో కలిసి
మంత్రి సబిత పరిశీలించారు. సీఎం పాల్గొనే సభాస్థలి వద్ద అటవీ, పోలీసు,
రెవెన్యూ, ఇతర అధికారులతో సమావేశమై సమీక్షించారు. మహేశ్వరం నియోజకవర్గం నుంచే
హరితోత్సవానికి శ్రీకారం చుట్టడం సంతోషకరమని మంత్రి పేర్కొన్నారు. ఎంపీ
రంజిత్‌రెడ్డి, కలెక్టర్ హరీశ్ పాల్గొన్నారు.