ప్రతిపాదన ఖరారుతోపాటు పనుల పురోగతిని సమీక్షించనున్న కేంద్ర జల్‌శక్తి శాఖ
మంత్రి షెకావత్
ఇప్పటికే రూ.12,911.15 కోట్ల విడుదలకు కేంద్ర ఆర్థికశాఖ అంగీకారం
ఆ మేరకు కేంద్ర కేబినెట్‌కు ప్రతిపాదన పంపాలని సూచన
కేబినెట్ ఆమోదిస్తే నిధులు విడుదల చేస్తామని వెల్లడి
విజయవాడ : పోలవరం ప్రాజెక్టుకు రూ.12,911.15 కోట్ల విడుదలకు సంబంధించి కేంద్ర
మంత్రిమండలికి పంపాల్సిన ప్రతిపాదనను ఖరారు చేయడమే అజెండాగా సోమవారం ఢిల్లీలో
కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఉన్నతస్థాయి సమావేశం
ఏర్పాటు చేశారు. కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్, కేంద్ర జలసంఘం
(సీడబ్ల్యూసీ) చైర్మన్ కుశ్వీందర్‌సింగ్ వోరా, పోలవరం ప్రాజెక్టు అథారిటీ
(పీపీఏ) సీఈవో శివ్‌నందన్‌కుమార్, రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి
శశిభూషణ్‌కుమార్, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి తదితరులు ఈ భేటీలో
పాల్గొననున్నారు. పోలవరం ప్రాజెక్టును సత్వరమే పూర్తిచేయడానికి రూ.పదివేల
కోట్లను అడ్‌హక్ (ముందస్తు)గా విడుదల చేయాలని ప్రధాని నరేంద్రమోదీని
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పలుమార్లు కోరారు. దీనికి స్పందించిన
ప్రధాని నరేంద్రమోదీ పోలవరం ప్రాజెక్టుకు నిధుల సమస్య లేకుండా చూడాలని కేంద్ర
ఆర్థికశాఖను ఆదేశించారు. దీంతో ప్రాజెక్టు తొలిదశను సత్వరమే పూర్తిచేయడానికి
వీలుగా రూ.12,911.15 కోట్లు విడుదల చేసేందుకు జూన్ 5న కేంద్ర ఆర్థికశాఖ
మంత్రి నిర్మలాసీతారామన్ అంగీకరించారు.
ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను దక్కించుకునే క్రమంలో 2013–14 ధరలతోనే
ప్రాజెక్టును పూర్తిచేస్తామని 2016లో నాటి సీఎం చంద్రబాబు అంగీకరించారు.
2013–14 ధరల ప్రకారం ప్రాజెక్టు అంచనా వ్యయం కంటే ఇప్పటికే అధికంగా ఖర్చుచేసిన
నేపథ్యంలో అదనంగా నిధుల విడుదలకు అడ్డంకిగా మారింది. అదనంగా నిధులు మంజూరు
చేయాలంటే కేంద్ర మంత్రిమండలి ఆమోదం తప్పినిసరి. ఆ క్రమంలోనే రూ.12,911.15
కోట్లు మంజూరు చేయాలని కేంద్ర మంత్రిమండలికి ప్రతిపాదన పంపాలని కేంద్ర
ఆర్థికశాఖ మంత్రి నిర్మిలాసీతారామన్ కేంద్ర జల్‌శక్తి శాఖకు సూచించారు.
మంత్రిమండలి ఆమోదముద్ర వేసిన వెంటనే నిధులు విడుదల చేస్తామని చెప్పారు. ఈ
నేపథ్యంలో ప్రాజెక్టుకు నిధులు విడుదలకు సంబంధించిన ప్రతిపాదనను పీపీఏ ద్వారా
కేంద్ర జల్‌శక్తి శాఖకు రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు పంపారు. దీనిపై కేంద్ర
జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ సమీక్షించి కేంద్ర మంత్రిమండలికి
పంపాల్సిన ప్రతిపాదనను ఖరారు చేయనున్నారు. ప్రాజెక్టు పనుల పురోగతిని
సమీక్షించి, సత్వరమే పూర్తిచేయడానికి చేపట్టాల్సిన చర్యలపై సీడబ్ల్యూసీ,
పీపీఏ, రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు.