ఎమ్మెల్సీ కవిత ఈడీకి లేఖ రాశారు. ముందస్తు అపాయింట్మెంట్లు, కార్యక్రమాలు
ఉన్నందున గురువారం విచారణకు హాజరు కాలేనని తెలిపారు. కవిత విజ్ఞప్తిపై ఈడీ
స్పందించాల్సి ఉంది. దర్యాప్తు సంస్థలకు పూర్తిగా సహకరిస్తానని కేసీఆర్,
బీఆర్ఎస్ను లొంగ దీసుకోవడం సాధ్యం కాదని కవిత మరో ప్రకటనలో తెలిపారు.ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు : ఈ నెల 11న హాజరుకాగలనని కవిత ఈడీ లేఖ
దిల్లీ మద్యం కుంభకోణంపై దర్యాప్తులో భాగంగా ఎన్ఫోర్స్మెంట్
డైరక్టరేట్(ఈడీ) విచారణకు నేడు హాజరు కాలేనని ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. ఈడీ
నోటీసులపై న్యాయవాదులతో చర్చించిన కవిత.. తాను ఈ నెల 11న విచారణకు
హాజరుకాగలనని ఈడీ జాయింట్ డైరెక్టర్‌కు లేఖ రాశారు. మనీలాండరింగ్ ఆరోపణల
నేపథ్యంలో దర్యాప్తు నిమిత్తం ఈనెల 9న దిల్లీలోని కార్యాలయానికి రావాలని ఈడీ
నోటీసులు జారీ చేసింది.
ఈ నెల 11న విచారణకు హాజరవుతా
ఐతే ముందస్తు కార్యక్రమాల వల్ల ఆ రోజు విచారణకు హాజరుకాలేనని ఈ నెల 11 రాగలనని
కవిత లేఖలో పేర్కొన్నారు. ఇంత స్వల్పకాలంలో విచారణకు రావాలని కోరడమేమిటని
లేఖలో ప్రశ్నించారు. గతంలో వివిధ కోర్టులు ఇచ్చిన తీర్పుల ప్రకారం వీడియో
కాన్ఫరెన్స్ ద్వారా విచారించే అవకాశం ఉన్నా నేరుగా ఈడీ కార్యాలయానికి హాజరు
కావాలని నోటీసులివ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కవిత రాసిన లేఖపై ఈడీ
స్పందించాల్సి ఉంది.
ఈడీ నోటీసులకు సంబంధించి చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా దర్యాప్తు సంస్థలకు
సహకరిస్తానని ఎమ్మెల్సీ కవిత ఒక ప్రకటన విడుదల చేశారు. ఇలాంటి చర్యల వల్ల
తెలంగాణ ఎప్పటికీ కేంద్రంలోని బీజేపీ సర్కారుకి తలవంచేది లేదని స్పష్టం
చేశారు. ఆ పార్టీ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడుతున్న సీఎం కేసీఆర్,
బీఆర్ఎస్ని లొంగ దీసుకోవడం సాధ్యం కాదన్నారు. రాజకీయ రంగంలో మహిళలకు తగిన
ప్రాతినిధ్యం కల్పించాలనేది తమ ఆకాంక్ష అని తెలిపారు. ఇందులో భాగంగానే
సుదీర్ఘకాలం పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్‌బిల్లును పార్లమెంటులో
ప్రవేశపెట్టాలనే డిమాండ్‌తో ప్రతిపక్షపార్టీలు, మహిళా సంఘాలతో కలిసి భారత్
జాగృతి ఈనెల 10న దిల్లీ జంతర్ మంతర్ వద్ద ఒకరోజు నిరాహార దీక్షను
తలపెట్టిందని తెలిపారు. ఈ క్రమంలోనే నేడు దిల్లీలో విచారణకు రావాల్సిందిగా ఈడీ
నోటీసులిచ్చిందని చెప్పారు.
ప్రజల హక్కుల కోసం ధైర్యంగా పోరాటం చేస్తాం
సీఎం కేసీఆర్ నాయకత్వంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే
ఉంటామని, ప్రజల హక్కుల కోసం ధైర్యంగా పోరాటం చేస్తామని కవిత స్పష్టం చేశారు.
ఈడీ నోటీసులు అందుకున్న అనంతరం కవిత ఆ విషయాన్ని సీఎం కేసీఆర్‌కు ఫోన్ ద్వారా
తెలిపారు. ఈ సందర్భంగా సీఎం ఆమెకు ధైర్యం చెప్పారని తెలిసింది. విపక్షాలను
వేధించే ఎత్తుగడలో భాగంగానే బీజేపీ ఇదంతా చేస్తోందని, ఏ మాత్రం భయపడవద్దని
న్యాయపరంగా, మనోధైర్యంతో పోరాడాలని సూచించినట్లు సమాచారం.