ఈ రోజు రాత్రి రాజ్ భవన్ లో బస చేయనున్న రాష్ట్రపతి
రేపు దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో సీజీపీకి హాజరుకానున్న ముర్ము
రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ఈ రోజు, రేపు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్ : భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము మరోసారి తెలంగాణ పర్యటనకు
వస్తున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ముర్ము ఈ రోజు రాత్రి హైదరాబాద్
రానున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానం ద్వారా బేగంపేట విమానాశ్రయంలో
దిగనున్న ఆమె నేరుగా రాజ్‌భవన్ చేరుకుని ఈ రోజు రాత్రి అక్కడ బస చేస్తారు.
శనివారం ఉదయం దుండిగల్‌లోని ఎయిర్ ఫోర్స్ అకాడమీలో జరిగే కంబైన్డ్
గ్రాడ్యుయేషన్ పరేడ్ (సీజీపీ) కు ముర్ము ముఖ్య అతిథిగా హాజరవుతారు. పరేడ్
శిక్షణలో ప్రతిభ చూపిన క్యాడెట్లకు రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము అవార్డులు
అందజేయనున్నారు. స్నేహపూర్వక విదేశీ దేశాల నుంచి వచ్చి వైమానిక దళ అకాడమీలో
శిక్షణ పొందిన క్యాడెట్లకు ఆమె ‘వింగ్స్’, ‘బ్రెవెట్’ను అందజేస్తారు. ఈ
వేడుకలో అనేక విమానాల విన్యాసాలు కూడా జరగనున్నాయి. ఈ కార్యక్రమం ముగిసిన
వెంటనే ముర్ము ఢిల్లీ బయల్దేరి వెళ్తారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా శుక్ర,
శని వారాల్లో నగరంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. శుక్రవారం
సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు సీటీవో జంక్షన్, బేగంపేట్, బేగంపేట్
ఫ్లైఓవర్, గ్రీన్ ల్యాండ్స్ జంక్షన్, పంజగుట్ట జంక్షన్, ఎన్.ఎఫ్.సి.ఎల్
జంక్షన్లలో ట్రాఫిక్ రూల్స్ అమలు జరుగనున్నాయి. అలాగే శనివారం ఉదయం 6 గంటల
నుంచి 8 గంటల మధ్య ట్రాఫిక్ ఆంక్షలుంటాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.