వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేందుకు
ప్రయత్నించారని నేరాభియోగాలు ఎదుర్కొంటున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
తాను నిర్దోషినని పేర్కొన్నారు. వాషింగ్టన్ ఫెడరల్ కోర్టుకు ట్రంప్
హాజరయ్యారు. అమెరికా మాజీ అధ్యక్షుడు మళ్లీ పాత రాగమే అందుకున్నారు. 2020
అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని తారుమారు చేసేందుకు కుట్ర చేశారన్న కేసులో తాను
నిర్దోషినే అని వాషింగ్టన్ ఫెడరల్ కోర్టులో హాజరై వాంగ్మూలం ఇచ్చారు.
జస్టిస్ డిపార్ట్మెంట్ ప్రత్యేక న్యాయవాది జాక్ స్మిత్ నేరారోపణలు మోపిన 2
రోజుల తర్వాత.. ట్రంప్ గురువారం మెజిస్ట్రేట్ ముందు హాజరయ్యారు.
మెజిస్ట్రేట్ ప్రశ్నించినప్పుడు ట్రంప్ లేచి నిల్చుని సమాధానం ఇచ్చారు. ఈ
సమయంలో ఆయనపై అభియోగాలు మోపిన జాక్ స్మిత్ కూడా కోర్టు హాల్లోనే ఉన్నారు.
విచారణ అనంతరం మీడియాతో అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ముచ్చటించాడు.
అమెరికాకు ఇది విచారకరమైన రోజనీ, దేశంలో ఇలా జరుగుతుందని తానెప్పుడు
అనుకోలేదని వివరించారు. ఇది రాజకీయ ప్రేరేపిత కుట్రన్న ట్రంప్.. తనను
రాజకీయంగా ఎదుర్కోలేకే ఇలా చేస్తున్నారని తెలిపారు. అంతకుముందు.. ట్రంప్
వాషింగ్టన్ డీసీకి ప్రత్యేక విమానంలో వచ్చారు. తర్వాత భారీ కాన్వాయ్‌లో
వాషింగ్టన్ డీసీ నగరం గుండా ప్రయాణించి కోర్టు వద్దకు చేరుకున్నారు. 2020
అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ విజయాన్ని ధ్రువీకరించకుండా కాంగ్రెస్‌ను ఆపేందుకు
2021 జనవరిలో క్యాపిటల్ భవనంపై ట్రంప్ మద్దతుదారులు దాడికి పాల్పడ్డారని
ఆయనపై నేరాభియోగం నమోదైంది. ఇందులో ఆయన దోషిగా తేలితే ట్రంప్ జైలుకు
వెళ్లాల్సి ఉంటుంది.