కోల్కతా : భారత నౌకాదళ అమ్ములపొదిలోకి మరో అధునాతన స్వదేశీ యుద్ధనౌక
ఐఎన్ఎస్ ‘వింధ్యగిరి’ చేరింది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కోల్కతాలోని
హుగ్లీ నది తీరంలో ఈ నౌకను అధికారికంగా భారత నావికాదళంలోకి ప్రవేశపెట్టారు. ఈ
సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ ఈ అధునాతన యుద్ధనౌక ఉత్పత్తి ఆత్మనిర్భర్
భారత్కు, దేశ సాంకేతిక పురోగతికి నిదర్శనమని పేర్కొన్నారు. దేశ సముద్ర పోరాట
సామర్థ్యాలను పెంపొందించడంలో దీన్ని ఓ ముందడుగుగా ఆమె అభివర్ణించారు. నౌకను
నిర్మించిన గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్(జీఆర్సీఈ)కు
అభినందనలు తెలిపారు. శత్రుదేశ రాడార్లకు చిక్కకుండా స్వదేశీ పరిజ్ఞానంతో ఏడు
యుద్ధనౌకలను తయారు చేయాలని భారత నౌకాదళం ‘ప్రాజెక్టు 17ఎ’ ప్రారంభించింది.
ఇందులో వింధ్యగిరి ఆరో యుద్ధనౌక. గైడెడ్ క్షిపణులను ప్రయోగించగల సామర్థ్యం
ఉన్న ఈ నౌక పొడవు 149 మీటర్లు, బరువు 6,670 టన్నులు. వేగం.. 28 నాట్లు. గగన,
ఉపరితల, సముద్రగర్భం నుంచి వచ్చే ముప్పులను ఇది ఎదుర్కొగలదు.