జెరూసలేం : వివాదాస్పద న్యాయ వ్యవస్థ సంస్కరణల బిల్లును ఇజ్రాయెల్
పార్లమెంట్ ఆమోదించింది. తుది ఓటింగ్ నిర్వహించారు. ఈ ఓటింగ్‌ను ప్రతిపక్షం
బహిష్కరించింది. బిల్లుకు అనుకూలంగా 64 ఓట్లు లభించగా, వ్యతిరేకంగా ఒక్క ఓటు
కూడా పడలేదు. ఈ బిల్లుపై ఏకంగా 30 గంటలపాటు పార్లమెంట్లో చర్చ జరిగింది.
ఒకవైపు చర్చ జరుగుతుండగానే, మరోవైపు దేశవ్యాప్తంగా బిల్లుకు వ్యతిరేకంగా
నిరసనలు, ఆందోళనలు కొనసాగాయి. జనం వీధుల్లోకి వచ్చి తమ ఆగ్రహాన్ని వ్యక్తం
చేశారు. ఇజ్రాయెల్ న్యాయ వ్యవస్థలో మార్పులు తలపెట్టడాన్ని అమెరికాతోపాటు
పశ్చిమ దేశాలు సైతం వ్యతిరేకిస్తున్నాయి. న్యాయ వ్యవస్థను సంస్కరిస్తామంటూ
ప్రజలకు హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చామని, ఇప్పుడు ఆ హామీని
నెరవేరుస్తున్నామని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ
చెబుతున్నారు. ఈ కొత్త బిల్లు ప్రకారం.. ప్రభుత్వం తీసుకొనే నిర్ణయాలను
కోర్టులు అడ్డుకోరాదు. అంటే న్యాయ వ్యవస్థపై ప్రభుత్వానిదే పైచేయి అవుతుంది.