దేశంలోనే సంక్షేమం, అభివృద్దిలో నెంబర్ వన్ గా ఎదిగిందిన రాష్ట్ర తెలంగాణ
జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు క్షేత్ర స్థాయిలో సమన్వయంతో తెలంగాణ
దశాబ్ది ఉత్సవాలు విజయవంతం చేయాలి
రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్
జగిత్యాల : తెలంగాణ రాష్టం సాధించిన అనంతరం ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత గత
తొమ్మిది సంవత్సరాలుగా సాధించిన ప్రగతిని పల్లె పల్లెన ప్రజలకు వివరిస్తూ
ఘనంగా రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర సంక్షేమ
శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని
సమావేశ మందిరంలో శనివారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సన్నాహక
సమావేశానికి మంత్రి కొప్పుల ఈశ్వర్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. దశాబ్ది
ఉత్సవాలలో నియోజకవర్గ పరిధిలో శాసనసభ్యుల చొరవ తీసుకుని, అందరూ ప్రజా
ప్రతినిధులు, అధికారులతో కలిసి ప్రభుత్వం సూచించిన క్యాలెండర్ ప్రకారం పెద్ద
ఎత్తున కార్యక్రమాలు నిర్వహించి విజయవంతం చేయాలని మంత్రి ఆదేశించారు. జూన్ 2
న పథకావిష్కరణ, దశాబ్ది ఉత్సవ సందేశం తో ఉత్సవాలు ప్రారంభమై జూన్ 22 అమరవీరుల
సంస్మరణ సభ,అమరవీరుల స్తూపం అవిష్కరణతో ముగిస్తున్నట్లు మంత్రి తెలిపారు. జూన్
2వ తేదీ నుండి 20 రోజుల పాటు ఊరూరా పండుగ వాతావరణంతో ఘనంగా దశాబ్ది ఉత్సవాలు
నిర్వహించాలని, తెలంగాణ ప్రగతిని ప్రతి ఒక్కరికి తెలిసేలా వెలుగెత్తి
చాటాలన్నారు.
రాష్ట్రం రాక ముందు, వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధిని మరొక్కసారి గుర్తు
చేస్తూ ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. రైతు వేదికల వద్ద ఆయా
నియోజకవర్గాల ఎమ్మెల్యేలు రైతులతో కలిసి భోజనం చేయాలని, రాష్ట్రం ఏర్పాటు
లాగే జగిత్యాల జిల్లా ఏర్పాటు అనేది ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ నెరవేరిందని,
అదే విధంగా నూతన మండలాలు, నూతన గ్రామ పంచాయతీల ఏర్పాటుతో ప్రజలకు పాలన మరింత
దగ్గరైందని అన్నారు. కొత్త జిల్లాగా ఏర్పాటు అయిన జగిత్యాల జిల్లా కేంద్రంలో
సంబరాలు పెద్ద ఎత్తున నిర్వహించాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యా
కోసం జరుగుతున్న కృషిని, మన ఊరు- మన బడి కింద పాఠశాలల్లో వచ్చిన మార్పును
నాడు-నేడు ఫొటోలతో ప్రదర్శించాలని పేర్కొన్నారు. కామారెడ్డికి మెడికల్
కాలేజ్, బాన్స్వాడలో నర్సింగ్ కళాశాల, వివిధ చోట్ల వచ్చిన ప్రభుత్వ డిగ్రీ,
ఇతర కళాశాలలు, గురుకుల, సంక్షేమ ఇతర పాఠశాలల వివరాలు తెలియ జేయాలన్నారు. పల్లె
ప్రగతి, పట్టణ ప్రగతితో జాతీయ స్థాయి అవార్డులు సాధించి తెలంగాణ రాష్ట్రం
దేశానికి ఆదర్శంగా నిలిచిందని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. మిషన్
కాకతీయ పథకం ద్వారా సాగునీటి చెరువుల పునరుద్ధరణ, గ్రామాల్లో చెక్ డ్యాములు,
ఊట చెరువుల నిర్మాణం తో భూగర్భ జలాలు పెరిగాయని తెలిపారు. రాష్ట్రం వస్తే
చీకటి అవుతుందని చెప్పిన చోట నేడు విద్యుత్తు వెలుగులు చిమ్ముతూ 9 ఏళ్లలో
సాధించిన ప్రగతిని గర్వాంగా చాటుకుంటు ప్రజలతో మమేకం అవుతూ ప్రచారం
చేయాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రచారం చేయాలని,
ఒక్కో గ్రామానికి అందుతున్న రైతు బంధు, రైతు భీమా, వివిధ రకాల పెన్షన్లు, షాది
ముబారక్, కళ్యాణ లక్ష్మి, చెరువుల్లో వదిలిన చేప పిల్లలు, గొర్రెల పంపిణీ
అన్ని రకాల వివరాలతో గ్రామాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని తెలిపారు. పల్లె
ప్రగతి, పట్టణ ప్రగతి కింద మంజూరైన పనుల వివరాలతో పాటు అన్ని రకాల అభివృద్ధి
నిధుల వివరాలు తెలిసేలా ప్రచారం చేయాలన్నారు. ఆధునికతతో ఉపాధి కోల్పోయిన కుల
వృత్తుల వారికి అండగా నిలవాలని ప్రభుత్వం నిర్ణయించి ఒక లక్ష రూపాయలు ఇవ్వాలని
ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు నిర్ణయించారని తెలియజేశారు. ఈ సమీక్ష సమావేశం లో
జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్, ఎమ్మెల్యేలు డా సంజయ్ కుమార్, సుంకే
రవిశంకర్, ఎస్పీ భాస్కర్, అదనపు కలెక్టర్లు బి.ఎస్.లత , మంద మకరంద్, గ్రంథాలయ
సంస్థ చైర్మన్ డా.చంద్రశేఖర్ గౌడ్, శ్రీకాంత్ రెడ్డి, రైతు సమన్వయ సమితి
జిల్లా అధ్యక్షులు చీటీ వెంకట్ రావు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు తదితరులు
పాల్గొన్నారు.