సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి లబ్ధిదారుల పాలాభిషేకం
చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వైఎస్సార్ పింఛన్ కానుక పథకం అమలు
రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
విజయవాడ : వైఎస్సార్ పింఛన్ కానుక పెంపుతో రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం వచ్చిందని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. సత్యనారాయణపురం, చుట్టుగుంట, అజిత్ సింగ్ నగర్, ప్రకాష్ నగర్, వాంబేకాలనీలలో నూతన పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఆదివారం అట్టహాసంగా జరిగింది. వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు, డివిజన్ ఇంఛార్జిలతో కలిసి ఇంటింటికీ తిరిగి ఎమ్మెల్యే మల్లాది విష్ణు పింఛన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ చంద్రబాబు గత పాలనలో పింఛనుదారులలో ఒకరు చనిపోతే తప్ప మరొకరికి పింఛన్ ఇచ్చే వారు కాదని పేర్కొన్నారు. అటువంటి అమానవీయమైన విధానానికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వస్తి పలికారన్నారు. తెలుగుదేశం హయాంలో ఎన్నికల ముందు వరకు కేవలం రూ.వెయ్యి మాత్రమే పింఛన్ ఇచ్చే వారని గుర్తుచేశారు. కానీ నేడు ఒక్కొక్కరికీ రూ.2,750 చొప్పున అందిస్తుండటంతో అవ్వాతాతల మోముల్లో ఆనందం వెల్లివిరుస్తోందని చెప్పారు. గత టీడీపీ ప్రభుత్వం రాష్ట్రంలో కేవలం 39 లక్షల మందికి మాత్రమే పెన్షన్లను ఇచ్చిందని, కానీ ఈ ప్రభుత్వంలో 64.06 లక్షల మందికి అందిస్తున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం నెలకు రూ. 1,765 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం వెచ్చిస్తోందని తెలిపారు. ఒక్క సెంట్రల్ నియోజకవర్గంలోనే ప్రతినెలా రూ. 7 కోట్ల 22 లక్షల 54 వేలు పింఛన్ రూపంలో అందిస్తున్నట్లు మల్లాది విష్ణు తెలియజేశారు.