మంత్రి జోగి రమేష్
పెడన మున్సిపల్ నూతన చైర్ పర్సన్‌గా కటకం నాగకుమారి ఏకగ్రీవ ఎన్నిక
మచిలీపట్నం : అభివృద్ధి , సంక్షేమ ఫలాలు పెడన పట్టణవాసులందరికీ గతంలో ఏ విధంగా
అందించబడ్డాయో అదే మాదిరిగా ఆ రెండింటిని కొనసాగిస్తూ, చైర్ పర్సన్ పదవికి
వన్నె తెస్తూ, పార్టీ ప్రతిష్టను పెంపొందించే విధంగా కృషి చేయాలని రాష్ట్ర గృహ
నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ సూచించారు. గురువారం ఉదయం పెడన పట్టణంలో
మున్సిపల్ నూతన చైర్ పర్సన్ గా కటకం నాగ కుమారి ప్రమాణ స్వీకారోత్సవ
కార్యక్రమంలో మంత్రి జోగి రమేష్ ముఖ్యఅతిథిగా పాల్గొని ఆమెకు శుభాకాంక్షలు
తెలిపారు. పెడన మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నిక కార్యక్రమానికి ప్రిసైడింగ్
అధికారిగా మచిలీపట్నం ఆర్డిఓ ఐ. కిషోర్ వ్యవహరించారు. తొలుత పెడన పురపాలక సంఘం
మాజీ చైర్పర్సన్ బళ్లా జ్యోత్నరాణి 7 వ వార్డు కౌన్సిలర్ కటకం నాగ కుమారిని
నూతన చైర్ పర్సన్ అభ్యర్థిగా ప్రతిపాదించగా, 19 వ వార్డు కౌన్సిలర్ సిరివెళ్ల
జయేష్ బలపరిచారు. పోటీ అభ్యర్థి ఏ ఒక్కరు లేకపోవడంతో నూతన చైర్ పర్సన్ కటకం
నాగ కుమారి ఏకగ్రీవంగా ఎంపికైనట్లు ఎన్నికల అధికారి ఐ. కిషోర్ అధికారికంగా
ప్రకటించారు. అనంతరం మంత్రి జోగి రమేష్ పెడన మున్సిపల్ నూతన చైర్పర్సన్
పదవికి ఎన్నికైన కటకం నాగ కుమారిని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ
సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చైర్ పర్సన్ పదవిని అలంకరించడం ఒక మంచి పరిణామం
అని, పుర ప్రజలకు సేవ చేసే భాగ్యం కలగడం ఎంతో అదృష్టమని, గురుతర బాధ్యతతో
కూడిన పదవి ఇదేనని అన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా పెడన పట్టణంలో అభివృద్ధి
ప్రతి ఇంటి తలుపు తట్టిందన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన అద్భుత
పాలనతో ప్రజల మనసులను గెలుచుకున్నారన్నారు. ఈనెల 21వ తేదీన నేతన్న నేస్తం
మగ్గం డబ్బులు ప్రజలకు ఇవ్వనున్నారని పేర్కొన్నారు. పెడన పట్టణంలో 2,700
మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడమే కాక గృహాలను సైతం నిర్మించి ఇవ్వడం పెడన పట్టణ
చరిత్రలో గతంలో ఎన్నడూ జరగలేదన్నారు. పక్కా రోడ్ల నిర్మించడం, విద్యుత్
సౌకర్యం కలిగించడం, సురక్షిత తాగునీరు ప్రజలకు అందించడం వంటి ఎన్నో మంచి
కార్యక్రమాలు పెడన మున్సిపాలిటీ పరిధిలో జరిగిందన్నారు. 23 కౌన్సిలర్లు గాను
21 మంది కౌన్సిలర్లు వైయస్సార్సీపి పార్టీ తరుపున ఎన్నికయ్యారున్నారు.
మున్ముందు సైతం కౌన్సిలర్లు మంచి పనులతో తమ వ్యక్తిగత ప్రతిష్ట పెంచుకోవడమే
కాక పార్టీని మరింత బలోపేతం చేయాలని మంత్రి జోగి రమేష్ ఆకాంక్షించారు. తర్వాత
నూతనంగా చైర్ పర్సన్ గా పదవి బాధ్యతలు చేపట్టిన కటకం నాగ కుమారిని పలువురు
అభినందించారు, వైస్ చైర్మన్ ఖాజా, 17 వ వార్డు కౌన్సిలర్ మెట్ల గోపి ప్రసాద్,
21 వ వార్డు కౌన్సిలర్ పిచ్చుక సతీష్ బాబు, 9 వ వార్డు కౌన్సిలర్ గరికిముక్కు
చంద్రబాబు తదితరులు తమ పూర్తి సహాయ సహకారాలు నూతన చైర్పర్సన్ కటకం నాగ
కుమారికి అందిస్తామని సభాముఖంగా తెలిపారు. ఈ కార్యక్రమ ముగింపులో నూతన చైర్
పర్సన్ గా ఎన్నుకోబడింది కటకం నాగ కుమారి మాట్లాడుతూ, తనను చైర్ పర్సన్ పదవికి
ఎంపిక చేయడం పట్ల అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. జనరంజక పాలన అందిస్తున్న
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, నిత్యం అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం తపించే
గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ నేతృత్వంలో తాను పనిచేయడం ఒక అదృష్టంగా
భావిస్తానన్నారు. పెడన పట్టణవాసులకి తన స్థాయిని మించి ప్రజా సేవ చేసుకుంటానని
తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పెడన మున్సిపల్ కౌన్సిలర్లు, కో
ఆప్షన్ సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు
పాల్గొన్నారు.