పరిహారం చెల్లింపుల్లోనూ అవకతవకలు
కౌలు రైతు కుటుంబాలను ఆదుకునేందుకే జనసేన ఆర్ధిక భరోసా
నరసరావుపేటలో జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్
నరసారావు పేట : జనసేన పార్టీ ఏ కార్యక్రమం చేసినా చట్టానికి లోబడి, చట్ట
ప్రకారమే చేస్తుందని, రైతుల్లో భరోసా నింపేందుకు నిర్వహిస్తున్న కౌలు రైతు
భరోసా సభకు సహకరించాలని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల
మనోహర్ కోరారు. ఉద్దేశపూర్వకంగా ఈ ప్రాంతంలో అలజడులు సృష్టించి రాజకీయపరంగా
ప్రతిపక్ష పార్టీల మీద దాడులు చేసి ఉన్న పళంగా పోలీసు ఆంక్షలు అమల్లోకి
తీసుకురావడం పట్ల అనుమానాలు వ్యక్తం చేశారు. వరుసగా పంటలు నష్టపోయి ప్రభుత్వం
నుంచి భరోసా దక్కక భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారిన పరిస్థితుల్లో వందల
సంఖ్యలో కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. అలాంటి వారికి ప్రభుత్వం
నుంచి అందించే పరిహారం విషయంలో కూడా అవకతవకలు చోటు చేసుకున్నాయని తెలిపారు.
పలుకుబడి ఉన్నవారికే పరిహారం అందిందన్నారు. ఎలాంటి భరోసా దక్కని ఆ కుటుంబాలను
ఆదుకునేందుకు పవన్ కళ్యాణ్ ముందుకు వచ్చి కార్యక్రమానికి అందరికంటే ముందుగా
రూ. 5 కోట్ల విరాళం ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. జనసేన కౌలు రైతు భరోసా
యాత్ర ఇప్పటి వరకు ఆరు జిల్లాల్లో పూర్తి చేసుకుని ఉమ్మడి గుంటూరు జిల్లా
రైతాంగం కోసం సత్తెనపల్లిలో నిర్వహించబోతున్నట్టు తెలిపారు. శనివారం
నరసరావుపేటలోని జనసేన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారిన
పరిస్థితుల్లో కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ప్రభుత్వానికి స్పందించే
మనస్థత్వం లేదు. పైగా పంటలు నష్టపోయి ఇబ్బందుల్లో ఉన్న రైతుల్ని మరింత
ఒత్తిడికి గురిచేసే ప్రయత్నాలు చేశారు. కౌలు రైతు చనిపోతే ఇచ్చే పరిహారంలో
కూడా అక్రమాలు. చోటు చేసుకున్నాయి. చిన్న చిన్న రైతులకు పరిహారం అందడం లేదు.
కొన్ని చోట్ల పరిహారం చెల్లింపుల కోసం కమిషన్లు కూడా తీసుకున్నారు. ప్రతి
కుటుంబానికి పరిహారం ఇస్తున్నామని చెబుతున్న ముఖ్యమంత్రి మీరు ఇచ్చేది నిజం
అయితే మా సవాలు స్వీకరించండి. సత్తెనపల్లి సభకు రండి. పెద్ద దిక్కు కోల్పోయిన
పరిస్థితుల్లో ఆ కుటుంబాలు పడిన బాధలు మీకు తెలియచేస్తాం. వారికి ఎందుకు సాయం
అందలేదన్న విషయాన్ని ఆ కుటుంబాల నోటితోనే వినవచ్చు.
గుంటూరు జిల్లాలోనే రైతుల ఆత్మహత్యలు అధికం
జనసేన కౌలు రైతు భరోసా యాత్ర ప్రారంభించినప్పుడు సింహ భాగం ఆత్మహత్యలు రాయలసీమ
జిల్లాల్లో ఉంటాయని భావించాం. ఆశ్చర్యకరంగా గుంటూరు జిల్లాలో అత్యధిక సంఖ్యలో
రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. పల్నాడు ప్రాంతంలో ప్రతి నియోజకవర్గంలో పదుల
సంఖ్యలో రైతులు చనిపోయారు. జగన్ రెడ్డి తీసుకువచ్చిన చట్టం ప్రకారం రైతు
ఆత్మహత్య చేసుకున్న వెంటనే త్రీ మ్యాన్ కమిటీ క్షేత్ర స్థాయిలో పర్యటించి వారం
రోజుల్లోపు పరిహారం అందచేయాలి. అలా అతికొద్ది ప్రాంతాల్లో మాత్రమే ఇచ్చారు.
జనసేన పార్టీ ఏ కార్యక్రమం చేసిన ప్రజలకు పూర్తి స్థాయిలో ఉపయోగపడే విధంగా
ఉంటుంది. ఒక్కో కుటుంబానికి రూ. లక్ష సాయం అందచేసి చేతులు దులుపుకోకుండా ఆయా
జిల్లాల నాయకులతో కలసి ఆ రైతుల బిడ్డలను చదివించే ఏర్పాట్లు కూడా చేస్తున్నాం.
పంట నష్టానికి పరిహారం అందించాలి
భారీ వర్షాల కారణంగా వరి రైతులు కూడా తీవ్రంగా నష్టపోయారు. ఇప్పటి వరకు
యంత్రాంగం గాని, ప్రజా ప్రతినిధులు గాని ఆ ప్రాంతాల్లో కనబడడం లేదు. పత్తి
రైతులకు కూడా నష్టం వాటిల్లింది. ముఖ్యమంత్రి మానవత్వంతో స్పందించి వెంటనే
పంట నష్టం మీద అంచనాలు రూపొందించాలి. పరిహారం అందించి రైతుల్ని ఆదుకోవాలని
అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్,
పార్టీ జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, పార్టీ నాయకులు సయ్యద్ జిలానీ,
నయూబ్ కమాల్, బేతపూడి విజయ్ శేఖర్, బండారు రవికాంత్, బోని పార్వతి నాయుడు
తదితరులు పాల్గొన్నారు.