అమరావతి : గ్రామ, వార్డు సచివాలయాలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు.
సచివాలయాల్లో ఖాళీల భర్తీ, మెరుగైన పనితీరు, సమగ్ర పర్యవేక్షణపై చర్చించారు.
రోజూ మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్పందన నిర్వహించాలని సీఎం జగన్
అధికారులకు ఆదేశించారు. అలాగే ఆర్జీల పరిష్కారంలో నాణ్యత ఉండాలన్నారు.
అధికారులు ఓనర్షిప్ తీసుకుంటేనే సత్ఫలితాలు ఉంటాయన్నారు. అంగన్వాడీలను
సచివాలయాల పర్యవేక్షణలోకి తీసుకురావాలని జగన్ సూచించారు.
గ్రామ, వార్డు సచివాలయాలపై తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి
వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. సచివాలయాల్లో మెరుగైన
పనితీరు, సమగ్ర పర్యవేక్షణ, సుస్థిర ప్రగతి లక్ష్యాల సాధనలో సచివాలయాల కీలక
పాత్ర, సచివాలయాల్లో ఏర్పడ్డ ఖాళీల భర్తీ తదితర అంశాలపై సీఎం సమగ్ర సమీక్ష
జరిపారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ పరిపాలనలో విప్లవాత్మక మార్పుగా గ్రామ,
వార్డు సచివాయాలను ఏర్పాటు చేశామన్నారు. ‘‘చివరి స్థాయి వరకూ సమర్థవంతమైన
డెలివరీ మెకానిజమే లక్ష్యంగా వీటిని ఏర్పాటు చేశాం. ఇలాంటి వ్యవస్థ
సమర్థవంతంగా పనిచేయాలి. సరైన ఎస్ఓపీలు, పర్యవేక్షణ లేకపోతే ప్రయోజనం ఉండదు.
సిబ్బంది హాజరు దగ్గర నుంచి అన్నిరకాలుగా పర్యవేక్షణ ఉండాలి. గ్రామ, వార్డు
సచివాలయాల్లో మధ్యాహ్నం 3 గంటలనుంచి 5 గంటలవరకూ స్పందన నిర్వహించాలి.
ప్రభుత్వ విభాగాల వారీగా మండలాల స్థాయిలో పర్యవేక్షణ ఉండాలి. రిపోర్టింగ్
స్ట్రక్చర్ పటిష్టంగా ఉండాలని సీఎం పేర్కొన్నారు.
సీఎం జగన్ మాట్లాడుతూ గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న సిబ్బందిపై
విభాగాల వారీగా మండల స్థాయిలో పర్యవేక్షణ ఉండాలి. ఎవరెవరు ఏం చేయాలన్నదానిపై
చాలా స్పష్టత ఉండాలి. విధులు, బాధ్యతలపై ఎస్ఓపీలు ఉండాలి, వాటిని సమర్థవంతంగా
అమలు చేయాలి. అర్జీల పరిష్కారం కూడా చాలా ముఖ్యమైనది. వాటి పరిష్కారంలో
నాణ్యత ఉండాలి. ఒకే అర్జీ మళ్లీ వచ్చినప్పుడు మళ్లీ అదే వ్యవస్థ దాన్ని
పరిశీలించే బదులు, ఆ పై వ్యవస్థ పరిశీలన చేసి ఆ అర్జీని పరిష్కరించాలి. రీ
వెరిఫికేషన్ కోసం పై వ్యవస్థకు వెళ్లడం అన్నడం అన్నది ప్రధానం. ఈ అంశాలపై
అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అప్పుడే గ్రామ, వార్డు సచివాలయాలు
సమర్థవంతంగా పనిచేయగలుగుతాయి. అధికారులు ఓనర్షిప్ తీసుకోవాలి. అప్పుడే
ఆశించిన ఫలితాలు వస్తాయి. ప్రభుత్వ శాఖాధిపతులు ప్రతి నెల 2 సచివాలయాలను
తప్పనిసరిగా సందర్శించాలి. దీనివల్ల వాటి సమర్థత పెరుగుతుంది. సచివాలయాల
స్థాయిలో మెరుగైన సేవలు అందాలని కోరారు.