సచివాలయంలో జూ అథారిటీ ఆఫ్ ఎపి సమావేశం
సమావేశంకు అధ్యక్షత వహించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
విశాఖ జూపార్క్ కొత్త లోగో ఆవిష్కరణ
ఖడ్గమృగాల కోసం అస్సోం ప్రభుత్వంను సంప్రదిస్తాం
సిఎస్ఆర్ నిధులతో ‘జూ’ల్లో పర్యాటకులకు అదనపు సదుపాయాలు
తిరుపతి ‘జూ’లో బ్యాటరీతో నడిచే స్కూటర్లు
కపిలతీర్థం నుంచి జూపార్క్ వరకు కేబుల్ కార్ పై అధ్యయనం
దేశంలోని ఇతర జూపార్క్ లతో యానిమల్ ఎక్చ్సేంజ్ పై సంప్రదింపులు
మంత్రి పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి
వెలగపూడి : రాష్ట్రంలోని జంతుప్రదర్శన శాల (జూపార్క్)ల అభివృద్దికి ప్రత్యేక
చర్యలు తీసుకోవాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, ఇంధన, శాస్త్ర-సాంకేతిక, గనులశాఖ
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర
సచివాలయంలో గురువారం జూ అథారిటీ ఆఫ్ ఎపి గవర్నింగ్ బాడీ సమావేశం మంత్రి
అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని విశాఖ, తిరుపతి
జూపార్క్ లకు పర్యాటకులను మరింతగా ఆకర్షించేందుకు కార్యాచరణను ఖరారు
చేస్తున్నామని తెలిపారు. ఇందుకోసం దేశంలోని పలు జూపార్క్ అథారిటీలతో యానిమల్
ఎక్స్చేంజ్ కోసం సంప్రదింపులు జరుపుతున్నామని అన్నారు. నిర్ణీత కాల వ్యవధిలో
దీనిని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
తిరుపతి జూపార్క్ లో ఎలక్ట్రికల్ స్కూటర్లను ప్రవేశపెడుతున్నామని, దీనిద్వారా
వచ్చే దానిలో 30 శాతం జూపార్క్ కు ఆదాయంగా లభిస్తుందని తెలిపారు. ఇది విజయవంతం
అయితే విశాఖ జూపార్క్ లోనూ ఈ విధానంను ప్రవేశపెడతామని తెలిపారు. అలాగే
జూపార్క్ ల్లో జంతువులను సంరక్షించే సిబ్బంది నియామకాలు, రెగ్యులరైజేషన్ పై
హేతుబద్దత కోసం సమగ్ర నివేదికను సిద్దం చేయాలని పిసిసిఎఫ్ ను ఆదేశించారు.
తిరుపతి జూపార్క్ కు పర్యాటకులను ఆకర్షించేందుకు కపిలతీర్థం నుంచి కేబుల్ కార్
ను ఏర్పాటు చేయాలనే అంశంపై గతంలోనే సూచించామని, దానిపై అధికారులు అధ్యయనం
చేస్తారని తెలిపారు. పరిశ్రమల నుంచి సిఎస్ఆర్ నిధులతో జూపార్క్ ల్లో అవసరమైన
అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలని, ఇందుకోసం ఇతర జూపార్క్ ల్లో
అనుసరిస్తున్న విధానాలను పరిశీలించాలని సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని
రెండు జంతుప్రదర్శన శాలల్లో జంతువుల సంరక్షణ, వాటి ఆరోగ్యం, అందిస్తున్న
ఆహారంపై వెటర్నరీ కాలేజీకి చెందిన నిపుణులతో ఎప్పటికప్పుడు సమన్వయం
చేసుకోవాలని కోరారు. అస్సోం ప్రభుత్వంతో సంప్రదించి ఖడ్గమృగాలను
తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే జునాఘడ్, చెన్నై,
వరంగల్ జూపార్క్ అథారిటీలతో కూడా సంప్రదింపులు జరపాలని, వారి వద్ద ఉన్న
జంతువులకు బదులుగా మన రాష్ట్రంలోని జూపార్క్ ల్లో ఉన్న జంతువులను
మార్చుకోవాలని సూచించారు. జూ క్యూరేటర్ పోస్ట్ లను మరింత బలోపేతం చేసేందుకు జూ
డైరెక్టర్లుగా వారిని అప్ గ్రేడ్ చేసే అంశాన్ని కూడా ప్రభుత్వం సానుకూలంగా
పరిశీలిస్తోందని తెలిపారు. ఈ సందర్భంగా విశాఖ జూపార్క్ కు సంబంధించిన కొత్త
లోగోను మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా
జూపార్క్ లోని జంతువులకు నమూనాలుగా పర్యావరణ అనుకూల మెటీరియల్ తో తయారు చేసిన
పలు వస్తువులను కూడా మంత్రి ఆవిష్కరించారు. జూను సందర్శించే పర్యాటకులు తమ
అనుభవాలను గుర్తు చేసుకునే విధంగా జంతువుల చిత్రాలతో రూపొందించిన టీషర్ట్స్,
టోపీలు, గృహాలంకరణ వస్తువులను మంత్రి పరిశీలించారు. ఈ సమావేశంలో పిసిపిఎఫ్
(అటవీదళాల అధిపతి) మధుసూదన్ రెడ్డి, అడిషనల్ పిసిపిఎఫ్ శాంతిప్రియపాండే,
అటవీశాఖ స్పెషల్ సెక్రటరీ చలపతిరావు, విశాఖ క్యూరేటర్ నందినీ సలారియా, తిరుపతి
క్యూరేటర్ సెల్వం, విశాఖ సర్కిల్ హెడ్ శ్రీకంఠనాథరెడ్డి, తిరుపతి సర్కిల్ హెడ్
ఎన్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.