మట్టి… నార… తాటాకులు… కొబ్బరాకులు… ఇలా మనకు పల్లెల్లో దొరికే ప్రకృతి సంపదతోనే చక్కటి కళాకృతులు, గృహోపకరణాలు తయారుచేసే కళాకారులను ప్రోత్సహిస్తూ, భరోసా ఇచ్చే బాధ్యతను జనసేన తీసుకొంటుందని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తెలిపారు. మనకు అందుబాటులో ఉన్న ప్రకృతి వనరులతోనే వీటిని తయారు చేయడం వల్ల పర్యావరణాన్ని పరిరక్షించగలమన్నారు. ఇలాంటి వాటితో విగ్రహాలు, బొమ్మలు, వస్తువులు రూపొందించే హస్త కళాకారుల సంఖ్య తగ్గిపోతోందని, వారిని నైపుణ్యాలను యువతకు పరిచయం చేస్తే ప్రయోజనం ఉంటుందని తెలిపారు. ప్రకృతి వ్యవసాయ నిపుణుడు, పర్యావరణ ప్రేమికుడు విజయరామ్ మంగళవారం సాయంత్రం జనసేన కేంద్ర కార్యాలయంలో పవన్ కళ్యాణ్ ని కలిశారు. ఈ సందర్భంగా మట్టి, నార సంచులు, గడ్డితో రూపొందించిన వినాయక విగ్రహాన్ని చూపించారు. అదే విధంగా తాటి ఆకులతో, తాటి కమ్మలతో చేసిన కుర్చీలు, పీటలు, మంచాలు, ఇతర గృహోపకరణాలను పవన్ కళ్యాణ్ కి చూపించారు. వీటిని రూపొందించే కళాకారులు తగిన ప్రోత్సాహం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ స్పందిస్తూ “ఇలాంటి వస్తువులు, ఉపకరణాలు, కళాకృతుల వినియోగం పెంచితే ప్లాస్టిక్ వాడకం తగ్గి పర్యావరణాన్ని కాపాడటంలో మన వంతు బాధ్యతను మనం నిర్వర్తించినవాళ్లం అవుతాం. ఇలాంటి కళాకృతులు సృజించేవారికి భరోసా ఇస్తాం. జనసేన – తెలుగుదేశం మేనిఫెస్టోలో ఈ అంశంపై హామీని పొందుపరుస్తాం. ఇందుకు సంబంధించి మరింతగా వివరాలు తెలుసుకొనేందుకు కొద్ది రోజుల్లో ఒక వర్క్ షాప్ నిర్వహిస్తాం. దీని ద్వారా యువతకు ఈ వస్తువుల తయారీ గురించే కాకుండా పర్యావరణ పరిరక్షణ గురించి తెలియచేయవచ్చన్నారు.