న్యూఢిల్లీ : ఢిల్లీ పర్యటనలో భాగంగా బుధవారం కేంద్ర అటవీ పర్యావరణశాఖ మంత్రి
భూపేంద్ర యాదవ్‌తో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి భేటీ అయ్యారు. సుమారు
గంటపాటు జరిగిన ఈ సమావేశంలో ఏపీకి సంబంధించిన ఇరిగేషన్ ప్రాజెక్టులకు
పర్యావరణ అనుమతులు మంజూరుతో పాటు పలు కీలక అంశాలపైనా కేంద్రమంత్రికి
విన్నవించారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంకు సంబంధించి పర్యావరణ అనుమతులు
మంజూరు చేయాలని కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్‌ను కోరారు సీఎం జగన్. కరవుతో
అల్లాడే ఈప్రాంతానికి తాగునీరు సాగునీరు అందించడానికి ఈ పథకం అత్యంత కీలకమైనది
వివరించారాయన. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న శ్రీశైలం, నాగార్జున
సాగర్ రిజర్వాయర్లకు సంబంధించి పలు అంశాలను కేంద్ర మంత్రికి తెలియజేశారు.
మరోవైపు కృష్ణానదిపై ఉన్న ఉమ్మడి జలాశయాలైన శ్రీశైలం, నాగార్జున సాగర్
ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని, కృష్ణా
రివర్ మేనేజిమెంట్ బోర్డు సూచించిన అన్ని ఆపరేషనల్ ప్రోటోకాల్స్‌ను,
ఒప్పందాలను, ఆదేశాలను తెలంగాణ సర్కార్ ఉల్లంఘిస్తోందని కేంద్రమంత్రి దృష్టికి
తీసుకెళ్లారు.
ఏపీ ఇబ్బందుల్ని గుర్తించాలి : ఏపీ తనకు కృష్ణా నదిపై తనకున్న వాటా హక్కులను
కోల్పోవాల్సి వస్తోందని సీఎం జగన్ తెలియజేశారు. 2022–22, 2022–23 సంవత్సరాలలో
తెలంగాణా రాష్ట్రం– సీజన్ ప్రారంభమైన తొలిరోజు నుంచి అంటే జూన్ 1తేదీ నుంచే
విద్యుత్ ఉత్పత్తి కోసం నీటిని వినియోగించడం ప్రారంభించింది. శ్రీశైలం
జలాశయంలో కనీస స్ధాయి నీటి మట్టం 834 అడుగులు కంటే తక్కువగా ఉన్నప్పటికీ
తెలంగాణా ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తికి నీటి విడుదల చేయడంతో పాటు, కృష్ణా
రివర్ మేనేజిమెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) ముందు కనీసం ఎలాంటి ఇండెంట్ కూడా
లేకుండా ఏకపక్షంగా నాగార్జున సాగర్, కృష్టా డెల్టాకు అవసరం లేనప్పటికీ నీటి
విడుదల చేసింది. నీటి పారుదల అవసరాలకు విద్యుత్ ఉత్పత్తి అన్నది కేవలం
యాధృచ్చికంగా మాత్రమే ఉంటుంది. విద్యుత్ ఉత్పత్తి కోసం తెలంగాణ ప్రభుత్వం
ప్రతీ ఏటా 796 అడుగుల వరకు నీటిని దిగువకు విడుదల చేయడం వల్ల.. శ్రీశైలం
రిజర్వాయరులో కనీస నీటి మట్టం నిర్వహణకు సహకరించడం లేదు. దీనివల్ల
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎదుర్కొంటున్న ఇబ్బందిని ఇంతకు ముందే కేంద్రం
దృష్టికి తీసుకువచ్చాం అని సీఎం జగన్.. కేంద్ర మంత్రి వద్ద ప్రస్తావించారు.
శ్రీశైలంలో జలాశయంలో నీటిమట్టం 881 అడుగులకు చేరుకుంటే తప్ప
పోతిరెడ్డిపాడునుంచి పూర్తిస్థాయిలో నీటి విడుదల సాధ్యంకాదని సీఎం వైఎస్
జగన్ కేంద్రమంత్రికి వివరించారు.