కాకినాడ : పర్యావరణ పరిరక్షణలో సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ
భాగస్వాములు కావాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రెస్ అకాడమీ ఛైర్మన్
కొమ్మినేని శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. కాకినాడ జిల్లా పర్యటనలో
భాగంగా కొమ్మినేని శ్రీనివాసరావు కోరంగి వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని
సందర్శించారు. చెక్క వంతెనపై నడుస్తూ మడ అడవులను పరిశీలించారు. టూరిస్ట్
స్పాట్ ఫెర్రీ పాయింట్ నుంచి బోటులో ప్రయాణించి, ప్రకృతి ప్రసాదించిన అటవీ
సంపదను తిలకించారు. మడ అడవుల్లోని వృక్ష, జంతు సంపద, జీవ వైవిధ్యం
గురించి జిల్లా అటవీశాఖ అధికారి ఇందుకూరి కాశీవిశ్వనాథరాజు ప్రెస్ అకాడమీ
ఛైర్మన్‌కు వివరించారు. అనంతరం కోరింగ ఫారెస్ట్ కాంప్లెక్స్ సమావేశ
మందిరానికి చేరుకొని కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియతో
కలిసి 235 చ.కి.మీ. విస్తీర్ణంలో, 56,200 ఎకరాల్లో విస్తరించి ఉన్న కోరంగి
మడ అడవులపై ఏర్పాటుచేసిన ప్రదర్శనను తిలకించారు. అనంతరం అక్కడి
సమావేశ మందిరంలో ప్రెస్ అకాడమీ, జిల్లా అటవీశాఖ సంయుక్తంగా ఏర్పాటుచేసిన
మడ అడవుల సంరక్షణ-సామాజిక బాధ్యత-మీడియా పాత్ర, జర్నలిజం మౌలిక
సూత్రాలు-విలువలు-అంశాలపై చర్చా కార్యక్రమానికి కొమ్మినేని
శ్రీనివాసరావు ప్రెస్ అకాడమీ కార్యదర్శి ఎం.బాలగంగాధర్ తిలక్,
ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్, కాకినాడ రూరల్
ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, యానాం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస
అశోక్, డీఎఫ్‌వో ఐకేవీ రాజు, పర్యావరణవేత్త పేరిచర్ల రాజగోపాలరాజు,
స్థానిక ప్రజాప్రతినిధులు, జర్నలిస్టులతో కలిసి హాజరయ్యారు. ఈ
సందర్భంగా కొమ్మినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ కాకినాడ, పరిసర
ప్రాంతాలను ప్రకృతి విపత్తుల నుంచి మడ అడవులు, హోప్ ఐలాండ్
రక్షిస్తున్నాయని.. ఈ ప్రాంతాలను పర్యాటకంగా మరింత అభివృద్ధి చేయాల్సిన
అవసరముందని స్పష్టం చేశారు. ఈ మడ అడువులకు మరింత గుర్తింపు రావాల్సి
ఉందని.. ఇందుకు సరైన కార్యాచరణ అవసరమని, ఇందులో ఫోర్త్ ఎస్టేట్
మీడియాకు భాగస్వామ్యం కల్పించేందుకు, పాత్రికేయులను ఆ దిశగా నడిపించే
ఉద్దేశంతో ఈ సదస్సు ఏర్పాటు చేసినట్లు వివరించారు. పర్యాటక, అటవీ,
విద్య తదితర శాఖలు సమష్టిగా విద్యార్థులు, యువతకు మడ అడవుల
ప్రాశస్త్యంపై అవగాహన పెంపొందించాలని సూచించారు. 1977, నవంబర్‌లో వచ్చిన
దివిసీమ ఉప్పెన ఎంతో విషాదాన్ని మిగిల్చిందని, ఇక్కడి మడ అడవులు ఎన్నో
తుపాన్ల నుంచి కాకినాడ, పరిసర ప్రాంతాలను రక్షణగా
నిలుస్తున్నాయన్నారు. జర్నలిజం పవిత్రమైన, కీలకమైన వృత్తి అని
విలువలతో కూడిన, నిర్మాణాత్మకమైన పాత్రను జర్నలిస్టులు పోషించాలన్నారు.
సత్యం, మానవత, విశ్వసనీయత, బాధ్యత, జవాబుదారీతనం, ఈ అయిదు అంశాలు
పాత్రికేయులకు ముఖ్యమని కొమ్మినేని శ్రీనివాసరావు పేర్కొన్నారు.