జిల్లాలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి 15 రోజుల్లోగా డీపీఆర్ రూపొందించండి:
ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్
కర్నూలు జిల్లా కలెక్టర్ తో మంత్రి బుగ్గన అధ్యక్షతన సమీక్ష
కర్నూలు : కర్నూలు జిల్లాను పర్యావరణ పర్యాటక నిలయంగా మార్చే దిశగా వేగంగా
అడుగులు వేస్తున్నట్లు రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్
వెల్లడించారు. మంగళవారం కర్నూలు పట్టణంలోని ఆర్ అండ్ బీ అతిథి గృహంలో
సమావేశమై..ఆయన జిల్లా కలెక్టర్ తో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో
పర్యాటకాభివృధ్ధికి సంబంధించిన ప్రాజెక్టుల ప్రతిపాదనలు, డిజైన్లు, డీపీఆర్ లు
15 రోజుల్లోగా పూర్తవ్వాలని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆదేశించారు. నగర
శివారులో ఏర్పాటు చేస్తున్న విజయవనం (పుల్లయ్యపార్కు)పై ప్రత్యేక దృష్టి
పెట్టాలని మంత్రి ఆదేశించారు. విజయవనంలో పర్యాటక పరంగా మరిన్ని అభివృద్ధి
పనుల నిర్వహణపై మంత్రి జిల్లా కలెక్టర్ డా.జి.సృజన తో చర్చించారు. ఇందుకు
సంబంధించి రూ.10 కోట్ల నిధుల కోసం ప్రతిపాదనలు పంపాలని మంత్రి కలెక్టర్ కు
సూచించారు.
విజయవనాన్ని ఆధునిక హంగులతో ప్రజలను ఆకర్షించేలా తీర్చిదిద్దాలని మంత్రి
సూచించారు. వాకింగ్ పాత్, సైక్లింగ్ పాత్, యోగా సెంటర్, స్క్రీన్,సౌండ్ అండ్
లైట్ వ్యవస్థ తో ఆంఫి థియేటర్ లను అత్యాధునిక సదుపాయాలతో ఏర్పాటు చేసే దిశగా
మంత్రి బుగ్గన మార్గనిర్దేశం చేశారు. వాకింగ్ పాత్ లో సిమెంట్ కు బదులు
మట్టితో పూర్తి చేసేలా శ్రద్ధ వహించాలన్నారు. విజయవనం పార్కును
అందంగా,ఆకర్షణీయంగా చ తీర్చిదిద్దాలన్నారు. అవసరమైతే ఢిల్లీ లోని నెహ్రూ
పార్క్, లోధి గార్డెన్, హైదరాబాద్ లోని పాలపిట్ట, కేబీఆర్ పార్కులను
సందర్శించి..ఉత్తమమైన సౌకర్యాలను అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు…విజయ
వనం పార్కు పనులు వేగంగా జరిగేందుకు వీలుగా జిల్లా కలెక్టర్ ఛైర్మన్ గా
వహించేలా ‘ డెవలప్మెంట్ సొసైటీ’ని ఏర్పాటు చేయాలన్నారు. విజయ వనం పార్కు
పక్కనే టూరిజం శాఖకు సంబంధించిన 10 ఎకరాల విస్తీర్ణంలో కన్వెన్షన్ సెంటర్
ఏర్పాటు చేసేందుకు తగు చర్యలు చేపట్టాలన్నారు. ఇక్కడే వే సైడ్ రెస్టారెంట్,
ఇతర పర్యాటక వసతులను ఏర్పాటు చేయాలని మంత్రి టూరిజం అధికారులను ఆదేశించారు.
‘అడ్వెంచర్ టూరిజం’గా ఓర్వకల్ : ధైర్య, సాహసాల టూరిజం ప్రాంతంగా ఓర్వకల్లును
అభివృద్ధి చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ డా.జి.సృజన మంత్రికి వివరించారు.
రాక్ క్లైంబింగ్, స్కై సైక్లింగ్ వంటి ప్రాజెక్టులను పీపీపీ మోడల్ లో
అభివృద్ధి చేసేలా చర్యలు చేపడుతున్నట్లు మంత్రి బుగ్గనకు జిల్లా కలెక్టర్ సృజన
వివరించారు. ప్రస్తుతం ట్రెండీగా ఉన్న ట్రాన్స్పరెంట్ బబుల్ టెంట్ లను కూడా
ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.. విజయ వనం, ఓర్వకల్
పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేకంగా ఆర్కిటెక్ట్ ను నియమించి 15
రోజుల్లోపు డిజైన్లు, డీపీఆర్ లు రూపొందించనున్నట్లు కలెక్టర్ మంత్రికి
వివరించారు. సమావేశంలో ఎస్పీ జి. కృష్ణ కాంత్, జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి
మౌర్య, డీఎఫ్ఓ శివశంకర్ రెడ్డి, జిల్లా టూరిజం అధికారి విజయ, డివిజనల్ టూరిజం
మేనేజర్ చంద్రమౌళి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.