నరసరావుపేట : సిగ్నల్స్ లేని పల్నాడు జిల్లా శివారు గ్రామాల్లో మొబైల్ టవర్లు
ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నట్లు గుంటూరు టెలికం జిల్లా సేల్స్,
మార్కెటింగ్ అసిస్టెంట్ జనరల్ మేనేజరు ఎం.ఎస్. ప్రసన్న కుమార్ స్పష్టం
చేశారు. పల్నాడు జిల్లా నరసరావుపేట కేంద్రంలోని ఎర్రాప్రగడ టెలికాం
కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన వినియోగదారుల అవగాహనా సదస్సులో మాట్లాడారు.
ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ నరసరావుపేట సబ్ డివిజన్ పరిధిలో 20 ఎక్చేంజిలు
ఉన్నాయని, 2000 ల్యాండ్ లైన్ కనెక్షన్ లు ఉన్నాయన్నారు. అంతేకాక 4,400 ఫైబర్
కనెక్షన్లు ఇంటింటికి అందజేశామన్నారు. ఇప్పటికీ 15 వై.ఫై. పాయింట్లు ఏర్పాటు
చేశామన్నారు. నరసరావుపేట డి.ఈ. చంద్రశేఖర్ మాట్లాడుతూ, ప్రైవేటుతో
ప్రమేయంలేకుండా చిలకలూరిపేట, నరసరావుపేట కస్టమర్ సర్వీసు కేంద్రాలు ఏర్పాటు
చేస్తున్నామన్నారు. స్ధానిక ఎస్.డి.ఈ. నాగరాజు మాట్లాడుతూ వినియోగదారుల
ఫిర్యాదులకు తక్షణమే స్పందిస్తున్నామన్నారు. జె.టి.ఒ. శ్రీనివాసరావు
మాట్లాడుతూ ప్రతి వినియోగదారునికి తమ వంతుగా సేవలు అందిస్తున్నామన్నారు.
టెలికం సలహా కమిటి ఉమ్మడి గుంటూరు జిల్లా సభ్యులు నిమ్మరాజు చలపతిరావు
మాట్లాడుతూ బీఎస్ఎన్ఎల్ కు పూర్వ వైభవం చేకూరబోతున్నట్లు, ప్రధాని నరేంద్ర
మోదీ దేశవ్యాప్తంగా 4జి, 5జి సేవలకు వీలుగా బీఎస్ఎన్ఎల్ కు 89,047 కోట్ల
రూపాయలు కేటాయించటం జరిగిందన్నారు. ఈ సమావేశంలో టెలికం అధికారులు,
వినియోగదారులు పాల్గొన్నారు.