న్యూఢిల్లీ : తమ దేశంలోకి చొరబడిన ‘ఇండియా ఏజెంట్లు’ ఇద్దర్ని హత్య చేశారంటూ పాకిస్థాన్ చేసిన ఆరోపణలను భారత్ తిప్పికొట్టింది. ఇది అక్కసును వెళ్లగక్కేందుకు పాక్ చేసిన ఓ వ్యతిరేక ప్రచారంలో భాగమేనని విమర్శించింది. ఈ మేరకు విదేశాంగశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. పాకిస్థాన్ చాలా కాలంగా ఉగ్రవాదం, వ్యవస్థీకృత నేరాలు, చట్టవిరుద్ధమైన అంతర్జాతీయ కార్యకలాపాలకు కేంద్రంగా ఉంది. ఈ సంగతి యావత్ ప్రపంచానికి తెలుసు. దీనిపై ఎన్నో దేశాలు పాకిస్థాన్‌ను బహిరంగంగా హెచ్చరించాయి. విష సంస్కృతితోనే ఆ దేశం నాశమవుతుందని చెప్పినా బుద్ధి రాలేదు. పాకిస్థాన్ ఏమి విత్తుతుందో అదే పండుతుంది. తన దుశ్చర్యలకు ఇతరులను నిందించడం సరికాదు. ఇది పరిష్కారం కూడా కాదని విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. గతేడాది సియాల్కోట్, రావల్కోట్లో జైషే మహ్మద్, లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదులను పాక్‌లోకి చొరబడి భారత్ ఏజెంట్లు హత్య చేశారనడానికి తమ వద్ద ఆధారాలు ఉన్నాయంటూ పాకిస్థాన్ విదేశాంగశాఖ కార్యదర్శి సజ్జాద్ క్వాజి ఆరోపించిన సంగతి తెలిసిందే.