మృతుల కుటుంబాలను ఆదుకోవాలి : టీడీపీ అధినేత చంద్రబాబు
పాడేరు : అల్లూరి జిల్లాలోని పాడేరు ఘాట్రోడ్డులో ఆదివారం సాయంత్రం ఘోర
ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు లోయలో పడిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. 30
మందికి గాయాలయ్యాయి. వీరిలో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. విశాఖపట్నం నుంచి
పాడేరు వెళ్తున్న పాడేరు డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సు ఘాట్ రోడ్డు వ్యూ
పాయింట్ వద్ద అదుపు తప్పి ఏడు పల్టీలు కొట్టి 50 అడుగుల లోయలోకి
దూసుకెళ్లింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నారు.
లోయలో పడిన బస్సు వద్దకు చేరుకుని క్షతగాత్రులను కాపాడేందుకు స్థానికులు
తీవ్రంగా శ్రమించారు. అతి కష్టం మీద ప్రయాణికులను ప్రధాన రహదారిపైకి
తీసుకొచ్చారు. పాడేరు వైపు నుంచి వస్తున్న మరో ఆర్టీసీ బస్సులో క్షతగాత్రులను
పాడేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇటీవల కురిసిన వర్షాలకు చెట్టు కొమ్మలు
రోడ్డుపైకి వాలిపోవటం, రహదారి పక్కన రక్షణ గోడలేకపోవడమే ప్రమాదానికి కారణమని
ప్రయాణికులు ఆరోపించారు. ఘటనాస్థలిలో సెల్ఫోన్ సిగ్నల్ కూడా లేకపోవడంతో
ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు.
క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు : సీఎం జగన్ మోహన్ రెడ్డి
అమరావతి : అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఘాట్ రోడ్డులో ఆర్టీసీ బస్సు
ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం
చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అల్లూరి జిల్లా,
అనకాపల్లి, విశాఖపట్నం జిల్లా కలెక్టర్లు, ఆయా జిల్లాల పోలీసు యంత్రాంగానికి
సీఎం ఆదేశాలు జారీ చేశారు. బాధిత కుటుంబాలకు తోడుగా నిలవాలంటూ అధికారులను సీఎం
ఆదేశించారు. ఘటనకు దారితీసిన కారణాలపై అధికారులు దృష్టిసారించాలని సీఎం
పేర్కొన్నారు.
మృతుల కుటుంబాలను ఆదుకోవాలి : టీడీపీ అధినేత చంద్రబాబు
గుంటూరు : ఆర్టీసీ బస్సు ప్రమాదంపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు
నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బస్సు లోయలో పడిపోయిన ఘటనలో ఇద్దరు
చనిపోవడంపై విచారం వ్యక్తం చేశారు. తీవ్రంగా గాయపడిన బాధితులకు మెరుగైన
చికిత్స అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. సత్వర చర్యల ద్వారా
బాధితులకు సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని,
ప్రమాద ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలి :ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి
పురందేశ్వరి
విజయవాడ : అల్లూరి సీతారామ రాజు జిల్లాలోని పాడేరులో జరిగిన రోడ్డు ప్రమాదంపై
ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి స్పందించారు. పాడేరు వ్యూ
పాయింట్ వద్ద ఆర్టీసీ బస్సు లోయలో పడిన ఘటన బాధాకరమని ఆమె అన్నారు. గాయపడిన
వారికి వెంటనే మెరుగైన వైద్యం అందించాలని, తీవ్రంగా గాయపడిన ప్రమాద బాధితులను
విశాఖ తరలించాలని సూచించారు. గాయపడిన వారిలో చిన్నారులు మహిళలు ఉన్నారని,
వైద్య అధికారులు కూడా సంఘటనా స్థలానికి వెళ్ళేవిధంగా ప్రభుత్వం చర్యలు
తీసుకోవాలన్నారు. ప్రమాదంలో దుర్మరణం పాలైన వ్యక్తుల కుటుంబాలకు బీజేపీ తరపున
తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు పురందేశ్వరి ప్రకటించారు.