విజయవాడ : జర్నలిస్టు అక్రిడిటేషన్ లపై ప్రభుత్వం గత ఏడాది ప్రవేశపెట్టిన
కఠినతరమైన నిబంధనలను సడలించి అర్హులైన ప్రతి ఒక్క జర్నలిస్టునకు అక్రిడిటేషన్
తప్పకుండా మంజూరు చేయాలని ఏపీయూడబ్ల్యూజే డిమాండ్ చేసింది. ఈ విషయంలో
ప్రభుత్వం సానుకూలంగా స్పందించని పక్షంలో జర్నలిస్టులందరినీ ఐక్యపరిచి
ఉద్యమించడానికి కూడా వెనుకాడేదిలేదని సోమవారం మధ్యాహ్నం రాష్ట్ర సమాచార,
పౌరసంబంధాల శాఖ,కమిషనర్ విజయకుమార్ రెడ్డి ని ఏపీయూడబ్ల్యూజే నేతలు కోరారు.
రిటైర్డ్ అయిన ప్రతి ఒక్క జర్నలిస్టుకు రూ, 10 వేలు పెన్షన్ ఇవ్వాలని కమిషనర్
ను కోరారు. ఏపీయూడబ్ల్యూజే నేతలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులకు
సంబంధించిన పలు అంశాలపై సుధీర్ఘంగా చర్చించారు.
గత ఏడాది కఠినతరమైన నిబంధనలు ప్రవేశపెట్టడం ద్వారా చాలామంది అర్హులైన
జర్నలిస్టులు అక్రిడిటేషన్ కు నోచుకోక ఎన్నో ఇబ్బందులకు గురయ్యారని
వివరించారు. ఇప్పటికైనా అర్హులైన జర్నలిస్టులందరిని సరైన పద్దతిలో గుర్తించి
అక్రిడిటేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలానే యూనియన్లకు తగిన ప్రాతినిధ్యం
ఇస్తూ అక్రిడిటేషన్ కమిటీలో స్థానం కల్పించాలన్నారు, హెల్త్ కార్డులను వెంటనే
పునరుద్దరించాలని, జర్నలిస్టులందరికి ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించేలా తగు
చర్యలు తీసుకోవాలన్నారు. ప్రమాద బీమా, వెల్ఫేర్ ఫండ్ ను పునరుద్దరణ చేయాలని
కోరారు. రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులకు జారీ చేసిన అక్రిడిటేషన్లు 2022
డిసెంబర్ 31 నాటికి ముగియనున్న నేపధ్యంలో రాష్ట్రంలో అక్రిడిటేషన్ లేకుండా ఏ
ఒక్క జర్నలిస్టు ఇబ్బంది పడకూడదనే అంశంపై కమిషనర్ తో వివరంగా చర్చించారు.
జర్నలిస్టు సంఘాల ప్రాతినిధ్యంతో రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో
అక్రిడిటేషన్ కమిటీలను ఏర్పాటు చేస్తే అసలైన జర్నలిస్టు వ్యవస్థకు న్యాయం
జరుగుతుందన్నారు. గతంలో అనేక సార్లు ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్
వర్కింగ్ జర్నలిస్ట్స్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన విషయాన్ని
ఈ సందర్బంగా కమిషనర్ కు గుర్తుచేశారు. గతంలో జర్నలిస్టులకు నివేశన స్థలాలు
మంజారు చేస్తానని ఇచ్చిన సీఎం హామీని కూడా నిలబెట్టుకోవాలని గుర్తు చేశారు.
అనుభవజ్ఞులైన జర్నలిస్టుల అక్రిడిటేషన్లకు సంబంధించిన అర్హతను ప్రమాణాలను 25
ఏళ్ల సర్వీస్ తో 45ఏళ్ల వయస్సు నిండిన ప్రతి జర్నలిస్టులకు ఎటువంటి నిబంధనలు
లేకుండా ఫ్రీలాన్సర్ గా అక్రిడిటేషన్ మంజూరుచేయాలని డిమాండ్ చేశారు.పెద్ద,
చిన్న పేపర్లతో పాటు లోకల్ ఛానల్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్ అందేలా
కృషిచేయాలని ఐజేయూ, ఏపీయూడబ్ల్యూజే నేతలు ఓ వినతి పత్రాన్ని సమర్పించారు.
రాష్ట్ర సమాచార కమిషనర్ విజయకుమార్ రెడ్డి ని కలిసిన వారిలో ఐజేయూ
ఉపాధ్యక్షులు అంబటి ఆంజనేయులు, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐవీ
సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి చందు జనార్ధన్, ఉపాధ్యక్షులు కె జయరాజ్,
రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చావా రవి, విజయవాడ అర్బన్ కార్యదర్శి కొండా
రాజేశ్వరరావు, రాష్ట్ర కౌన్సిల్ మెంబరు దాసరి నాగరాజు ఉన్నారు. నేతల
అభ్యర్థనపై కమిషనర్ సానుకూలంగా స్పందించారు.