చిత్తూరు: యువగళం పాదయాత్ర ఆగదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పష్టం చేశారు.
పాదయాత్రను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే సహించబోమని లోకేశ్ మండిపడ్డారు.
పాదయాత్రకు అడ్డంకులు సృష్టిస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని
లోకేశ్ హెచ్చరించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం
పాదయాత్ర శుక్రవారం బంగారుపాళ్యం చేరుకుంది. అయితే బంగారుపాళ్యంలో లోకేశ్ సభకు
పోలీసులు అనుమతి నిరాకరించారు. లోకేశ్ రాక నేపథ్యంలో భారీ సంఖ్యలో పోలీసులు
బంగారుపాళ్యంలో మోహరించారు. లోకేశ్ సభకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం
చేశారు. దాంతో లోకేశ్ ధర్నాకు దిగారు. అటు టీడీపీ శ్రేణులు కూడా భారీగా
తరలిరావడంతో బంగారుపాళ్యంలో ఉద్రిక్తత ఏర్పడింది. లోకేశ్ సభకు అనుమతి
ఇవ్వాలంటూ టీడీపీ శ్రేణులు డిమాండ్ చేశాయి. లోకేశ్ ప్రసంగం వాహనం అందుబాటులో
లేకపోవడంతో, ఓ ఎత్తయిన స్టూల్ వేసుకుని అయినా మాట్లాడాలని లోకేశ్, టీడీపీ
నేతలు భావించారు. పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో టీడీపీ శ్రేణులు ఆగ్రహం
వ్యక్తం చేశాయి. టీడీపీ కార్యకర్తలను అక్కడి నుంచి తరలించేందుకు పోలీసులు
ప్రయత్నించారు. దాంతో ఆక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. లోకేశ్ జాతీయ జెండా చేతబూని
ఆ తోపులాట మధ్యే పాదయాత్ర కొనసాగించే ప్రయత్నం చేశారు. పాదయాత్రకు అనుమతులు
ఇచ్చే సమయంలోనే కొన్ని షరతులు విధించామని, ప్రజలతో ముఖాముఖీ తప్ప సభలకు అనుమతి
లేదని పోలీసులు అంటున్నారు. ఎంతకీ పోలీసులు వెనక్కి తగ్గకపోవడంతో, లోకేశ్ ఓ
భవనం మొదటి అంతస్తుకు చేరుకుని అక్కడినుంచి ప్రసంగించారు. దాంతో, టీడీపీ
శ్రేణులు ఈలలు, కేకలతో హోరెత్తించారు. నిన్న పలమనేరులో పోలీసులు లోకేశ్
వాహనాన్ని సీజ్ చేసిన సంగతి తెలిసిందే.
చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం
పాదయాత్ర ఎనిమిదో రోజు కొనసాగుతోంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా
లోకేశ్ యువగళం పాదయాత్ర ఎనిమిదో రోజు చిత్తూరు జిల్లాలో కొనసాగుతోంది.
పలమనేరులో పూర్తైన పాదయాత్ర పూతలపట్టు నియోజకవర్గం నుంచి ప్రారంభమయ్యింది.
మొగిలి నుంచి పాదయాత్ర ప్రారంభించే ముందు “సెల్ఫీ విత్ లోకేశ్” కార్యక్రమం
నిర్వహించారు. లోకేశ్‌ను కలవడానికి వచ్చిన ప్రజలు, అభిమానులు, కార్యకర్తలు
కలిసి సెల్ఫీలు దిగారు. అనంతరం స్వయంభు శ్రీ మొగిలేశ్వరస్వామి దేవస్థానంలో
ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు పూర్ణకుంభంతో
స్వాగతం పలికారు. స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన
మొగిలి ఆలయం నుంచి పాదయాత్ర ప్రారంభించారు.