ఒకరు సజీవ దహనం
దేశ రాజధాని ఢిల్లీ శివార్లలోని అలీపూర్‌లో ఘోరం చోటు చేసుకుంది. పార్క్ చేసిన కారులో ఓ వ్యక్తి సజీవ దహనమయ్యాడు. కారులో ఎముకలు తప్ప ఏమీ మిగలలేదని పోలీసులు తెలిపారు. సోమవారం (అక్టోబర్ 24) ఉదయం 7.03 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. అలీపూర్‌లోని పల్లా రోడ్లో పార్క్ చేసి ఉన్న కియా సెల్టోస్ కారు నుంచి మంటలు చెలరేగుతున్నాయని ఓ వాహనదారుడు పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించాడు. దీంతో మూడు ఫైరింజన్లతో ఫైర్ సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. మంటలను ఆర్పివేశారు.
అయితే, అప్పటికే నష్టం జరిగిపోయింది. కారులో ఓ వ్యక్తి కాలి బూడిదయ్యాడు. రోడ్డు పక్కన పార్క్ చేసి ఉన్న కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగినట్లు తెలుస్తోందని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ దేవేశ్ కుమార్ మహలా తెలిపారు. ఘటనా స్థలం నుంచి పోలీసులు కొన్నిదుస్తులను స్వాధీనం చేసుకున్నారని ఆయన చెప్పారు. మృతుడి వివరాల గురించి ఆరా తీస్తున్నారు. కారు నంబర్ ప్లేట్ ఆధారంగా పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. కురుక్షేత్రకు చెందిన ఓ వ్యక్తి పేరు మీద ఆ కారు రిజిస్టరై ఉందని వారు తెలిపారు. కురుక్షేత్రకు ఓ పోలీస్ బృందాన్ని పంపించినట్లు డీసీపీ దేవేశ్ కుమార్ తెలిపారు. కారులో ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగాయా? లేక ఎవరైనా కావాలనే నిప్పు పెట్టి దహనం చేశారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, కారుకు నిప్పు పెట్టారనే వార్తలను డీసీపీ ఖండించారు.
మూలం: టైమ్స్ నౌ