తిరుపతి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పార్టీ ధిక్కారానికి, వ్యతిరేక
కార్యకలాపాలకు పాల్పడితే, వారు ఎంతటి వారైనా చర్యలు తప్పవని మాజీ మంత్రి,
తిరుపతి జిల్లా రీజనల్ కో – ఆర్డినేటర్ బాలినేని శ్రీనివాస్ రెడ్డి స్పష్టం
చేశారు. దిక్కార స్వరం మితిమీరితే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు.
వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి స్థానంలో నియోజకవర్గ కో –
ఆర్డినేటర్ గా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డికి పార్టీ అధిష్టానం పూర్తి
బాధ్యతలు అప్పగించిందని గుర్తు చేశారు. తిరుపతి వేదికగా గురువారం వైఎస్ఆర్సీపీ
తిరుపతి జిల్లా అధ్యక్షులు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ
సమావేశం నిర్వహించారు. పార్టీ రీజనల్ కో-ఆర్డినేటర్ హోదాలో బాలినేని
శ్రీనివాసుల్ రెడ్డి, మంత్రి ఆర్.కే. రోజా, తిరుపతి ఎంపీ గురుమూర్తి,
ఎమ్మెల్సీ బల్లి చక్రవర్తి, ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్ రెడ్డి(తిరుపతి),
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి(చంద్రగిరి), బియ్యపు మధుసూదన్ రెడ్డి(శ్రీ
కాళహస్తి), కిలివేటి సంజీవయ్య(సూళ్లూరుపేట), కోనేటి ఆదిమూలం(సత్యవేడు),
వరప్రసాద్ (గూడూరు)తో పాటు పార్టీ పరిశీలకులు హాజరయ్యారు. ముందుగా బాలినేని,
నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి తిరుపతి జిల్లా ఎమ్మెల్యేలు, పరిశీలకులతో
సమావేశమయ్యారు. పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన పటిష్ట చర్యలపై సుదీర్ఘంగా
చర్చించారు. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలు, నాయకులతో సమావేశమయ్యే
అంశాలపై చర్చించారు. ఇందులో భాగంగా జిల్లా పరిధిలో ఈ నెల 6వ తేదీ సత్యవేడు, 7వ
తేదీ గూడూరు, 8వ తేదీ సూళూరుపేటలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశం
నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించారు.
అనంతరం మాజీ మంత్రి బాలినేని మీడియాతో మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో ఏ ఒక్క
స్థానం కోల్పోకుండా క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు.
అన్ని స్థానాల్లో విజయపతాకం ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. సీఎం వైఎస్
జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలతో పార్టీ బలోపేతానికి సంకల్పిస్తామన్నారు.
ఎమ్మెల్యేలకు అండగా నియోజకవర్గాలకు పరిశీలకులను నియామకం చేపట్టినట్లు
వెల్లడించారు.
జిల్లా అధ్యక్షులు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తిరుపతి
జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించేందుకు
శక్తి వంచన లేకుండా కృషి చేస్తాను. ఎమ్మెల్యే అభ్యర్థులను అఖండ మెజార్టీతో
గెలిపించి, తిరిగి రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డిని చూడాలనే ప్రజల
ఆకాంక్షను నెరవేర్చడమే తన విధి అని స్పష్టం చేశారు. తిరుపతి
జిల్లా పరిధిలోని నియోజకవర్గాల పరిశీలకులు శైలజ చరణ్ రెడ్డి (చంద్రగిరి),
సిహెచ్ సత్యనారాయణ రెడ్డి (వెంకటగిరి), చక్రపాణి రెడ్డి (శ్రీకాళహస్తి),
ప్రసాద్ రెడ్డి (తిరుపతి), సుధీర్ రెడ్డి (సూళ్లూరుపేట), దయాసాగర్ రెడ్డి
(సత్యవేడు), ముక్కాల ద్వారకనాథ్(గూడూరు) తదితరులు పాల్గొన్నారు.