నాపై గురతర బాధ్యతలు ఉన్నాయి
ప్రతి ఒక్కరూ తమ ప్రాంతాల్లో కార్యాచరణ చేపట్టాలి
క్షేత్ర స్థాయిలో అందరం కలిసి పార్టీ ని ప్రజల్లో కి తీసుకెళ్లాలి
మన బలం ఎంత అని అందరూ బెరీజు వేసుకోవాలి
రాష్ట్ర స్థాయి పదాధికారుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి
పురంధేశ్వరి
రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తా, గోదావరి ప్రాంతాలలో పురంధరేశ్వరి పర్యటన
23తేదీన రాయలసీమ జిల్లాలోని ప్రొద్దుటూరులో జిల్లా ముఖ్య నేతలతో సమావేశం
25న కోస్తా నేతలతో గుంటూరు, 26న గోదావరి జిల్లా నేతలతో రాజమండ్రిలో, 27వ తేదీన
ఉత్తరాంధ్ర నేతలతో విశాఖలో భేటీ
విజయవాడ : తనపై గురతర బాధ్యతలు ఉన్నాయని, పార్టీని బలోపేతం చేయడం తన ఒక్కరి
వల్లే సాధ్యం కాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి
అన్నారు. ఆదివారం విజయవాడలో ఆమె అధ్యక్షతన రాష్ట్ర స్థాయి పదాధికారుల సమావేశం
జరిగింది. ఈ సందర్బంగా పురంధేశ్వరి మాట్లాడుతూ ప్రతి కార్యకర్త తనకు సహకారం
అందించినప్పుడే పార్టీ బలోపేతం సాధ్యం అవుతుందన్నారు. క్షేత్ర స్థాయిలో
పార్టీని ప్రజలకు చేరువ చేసేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. 2014 తర్వాత
పార్టీని బలోపేతం చేసుకునేందుకు ఒంటరిగా వెళ్లాలని చాలా మంది సూచించారని,
అయితే పార్టీని బలోపేతం చేసుకునే దిశగా ముందు కసరత్తు చేయాలని అధినాయకత్వం
సూచించిందన్నారు. ఎన్నికలకు ఇంకా ఐదారు నెలల సమయమే ఉందని, అన్ని స్థాయిల్లోని
కమిటీలను బలోపేతం చేసుకోవాల్సి ఉంటుందన్నారు. పార్టీని బలోపేతం చేయడంతో పాటు..
రాజకీయంగా వేసే అడుగులపైనా ఆలోచించాలన్నారు. ఏపీలో ప్రజా వ్యతిరేక ప్రభుత్వం
పాలిస్తోందని, మద్యం డిస్టిలరీస్ అన్నీ అధికార పార్టీ పెద్దల సన్నిహితులకే
ఇచ్చారని విమర్శించారు. మద్యం అమ్మకాల్లో పెద్ద ఎత్తున కుంభకోణం జరుగుతోందని,
సీఎం ఇంటి సమీపంలో అత్యాచారం జరిగినా న్యాయం జరగని పరిస్థితి రాష్ట్రంలో
నెలకొందని ఆమె తీవ్రస్థాయిలో విమర్శించారు. పదో తరగతి పిల్లవాడిని.. ఓ
ఉపాధ్యాయుడిని పట్ట పగలు చంపేస్తున్న పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని
పురంధేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. యాప్ నొక్కితే చాలు పోలీసులొచ్చేస్తారని
సీఎం జగన్ చెప్పారు.. కానీ అలా జరుగుతోందా..? అని ప్రశ్నించారు. యువతకు ఉపాధి
అన్నారు.. కానీ అలా జరగడం లేదని, వాలంటీర్లు పర్మినెంట్ ఉద్యోగులు కారని,
వారిని కలుపుకుని ఉపాధి కల్పించామనే లెక్కలు వేసి చెబుతున్నారని అన్నారు.
రాష్ట్రానికి పెట్టుబడులు రావడం లేదని, వచ్చిన పరిశ్రమలు ఉండడం లేదని, లూలూ,
జాకీ వంటి కంపెనీలు పక్క రాష్ట్రాలకు తరలి వెళ్లిపోయాయన్నారు. రాష్ట్రంలో ఇసుక
దందా భారీ ఎత్తున జరుగుతోందని ఆరోపించారు. సుప్రీం కోర్టు కూడా ఇసుక తవ్వకాలు
ఆపాలని ఆదేశించిందన్నారు.
అన్నమయ్య డ్యాం కొట్టుకుపోవడానికి అక్రమ ఇసుక తవ్వకాలే కారణమని పురంధేశ్వరి
ఆరోపించారు. ఇసుక మాఫియా వల్ల పేదల జీవితాలు రోడ్డున పడ్డాయని, భవన నిర్మాణ
కార్మికులకు పనుల్లేవని, ఇసుక మాఫియాతో నేతలు జేబులు నింపుకోవడమే కాదు. పేదల
జీవితాలు ఛిద్రమవుతున్నాయని వ్యాఖ్యానించారు. ప్రజల సమస్యలపై పోరాడితేనే
ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతామన్నారు. సర్పంచులు పార్టీలకతీతంగా దారి మళ్లిన
నిధుల కోసం ఆందోళన చేస్తున్నారని, రాష్ట్రంలో ఎటు చూసినా సమస్యల వలయమే
కనిపిస్తోందన్నారు. కేంద్రం ఏపీకి అనేక రకాలుగా సహకారం అందిస్తోందని, ఇళ్లకు
రంగులు మార్చడంపై ఉన్న శ్రద్ధ.. ఇళ్ల నిర్మాణంపై చెప్పడం లేదని మండిపడ్డారు.
కేంద్ర నిధులను పక్క దోవ పట్టిస్తోందని, ఏపీ ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నం
అయిందని పురంధేశ్వరి పేర్కొన్నారు. ఈ సమావేశానికి పదాధికారులతో పాటు
రాష్ట్రస్థాయి , జిల్లాస్థాయి నేతలు హాజరయ్యారు.
వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలు, వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేలా
భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. అన్ని జిల్లాల్లో నియోజకవర్గాల వారీగా
స్థానిక సమస్యలపైనా కార్యక్రమాలు నిర్వహించాలని ఆమె సూచించారు. “2024
ఎన్నికలలో బీజేపీ ఎలా వెళ్లాలనే దానిపైనా చర్చ సాగింది. ప్రజా ఉద్యమాలతో పాటు,
పార్టీ కార్యక్రమాలు ఏ విధంగా చేపట్టాలో చర్చించడం జరిగింది. మోడీ పాలనలో
ఏపీకి చేసిన సాయం, అభివృద్ధి అంశాలను మరింత ముందుకు తీసుకెళ్తాం. వైసీపీ నేతలు
తొంభై శాతం మ్యానిఫెస్టోను అమలు చేయకుండానే గొప్పలు చెప్పుకుంటున్నారు. జగన్
ప్రజలను వంచించారు, మోసం చేశారు.. అసత్యాలను ప్రచారం చేస్తున్నారు. వీటన్నింటి
పైనా ఆధారాలతో ప్రజలకు వివరించేలా కార్యాచరణ ఉంటుంది. రాష్ట్ర అధ్యక్షురాలు
పురంధరేశ్వరి రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తా, గోదావరి ప్రాంతాలలో పర్యటిస్తారు.
23తేదీన రాయలసీమ జిల్లాలోని ప్రొద్దుటూరులో ఆ జిల్లా ముఖ్య నేతలతో సమావేశంలో
పాల్గొంటారు. 25న కోస్తా నేతలతో గుంటూరులో పాల్గొంటారు. 26న గోదావరి జిల్లా
నేతలతో రాజమండ్రిలో సమావేశం అవుతారు. 27వ తేదీన ఉత్తరాంధ్ర నేతలతో విశాఖలో
భేటీ అవుతారు. ఏపీ ప్రభుత్వ తీరుపై అనేక కేంద్ర సంస్థలు తప్పు పడుతున్నాయి.
ఇసుకను ఒకే సంస్థకు కాంట్రాక్టు కట్టబెట్టి కొత్త తరహా దోపిడీ చేశారు. కేంద్రం
పేదలకు ఇళ్లు ఇస్తే నిర్మాణం చేయకుండా మోసం చేశారు. ఏపీ వ్యాప్తంగా అనేక
ప్రాంతాలలో భూములు అమ్మకానికి చేస్తున్న ప్రయత్నాన్ని విరమించుకోవాలి. మూడు
దశల్లో మద్యపాన నిషేధం పెడతామని జగన్ చెప్పలేదా. నేడు అదే మద్యం పేరుతో పేదలను
ప్రభుత్వం దోపిడీ చేస్తుంది. ప్రభుత్వమే మద్యం అమ్ముకుని కోట్ల రూపాయలు
దోచుకుంటుంది. ఆ డబ్బుతో ఎన్నికల్లో ఓట్లు కొనేందుకు కుట్ర చేస్తుంది. ధరల
స్థిరీకరణ అన్న జగన్ ఎక్కడైనా డబ్బులు డిపాజిట్ చేశారా చెప్పాలి. దేశంలోనే
ఆత్మహత్యల జాబితాలో ఏపీ అగ్రభాగాన ఉందంటే జగన్ సిగ్గుపడాలి. వీటిని అంశాల
వారీగా ప్రజలకు వివరించేలా అన్ని నియోజకవర్గాల్లో పర్యటన చేసేలా కార్యక్రమాలు
చేపడతామని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు.