న్యూ ఢిల్లీ : కేంద్ర బడ్జెట్ ప్రకటన ముంగిట పార్లమెంటులో ఆర్థికమంత్రి హల్వా
తయారుచేయడం ఆనవాయతీ అని తెలిసిందే. ఓ సంప్రదాయంగా వస్తున్న ఈ కార్యక్రమాన్ని
ప్రస్తుత ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఆచరించారు. పార్లమెంటు
ప్రాంగణంలో హల్వా తయారుచేసిన నిర్మల అందరికీ వడ్డించారు. ఆర్థికశాఖ
సహాయమంత్రులు పంకజ్ చౌదరి, భగ్వత్ కిసాన్ రావు కరాద్ లకు, ఆర్థిక శాఖ
అధికారులకు, పార్లమెంటు నార్త్ బ్లాక్ లోని ఇతర మంత్రిత్వ శాఖల అధికారులకు
తియ్యని హల్వా తినిపించారు. నిర్మలా సీతారామన్ పెద్ద బాండీలో హల్వాను గరిటెతో
తిప్పుతూ ఈ ప్రక్రియలో ఉత్సాహంగా పాల్గొన్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి
బడ్జెట్ ను ఫిబ్రవరి 1న పార్లమెంటులో నిర్మలా సీతారామన్ సమర్పించనున్నారు.