హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా
ఇవ్వాలని అసలు కోరనేలేదని కేంద్ర జల్ శక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు
దేశ అత్యున్నత చట్టసభ పార్లమెంట్ సాక్షిగా పచ్చి అబద్ధాలు చెప్పారని, తన
తప్పుడు ప్రకటనను ఉపసంహరించుకొని కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్ తుడు క్షమాపణలు
చెప్పాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్
డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్ తుడు తన తప్పుడు ప్రకటనలు
సవరించుకొని వాస్తవాలతో కూడిన తాజా ప్రకటనను పార్లమెంట్ లో ప్రకటించాలని, లేని
పక్షంలో కేంద్ర జల శక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ పై పార్లమెంట్ లో
ప్రివిలేజ్ మోషన్ ఇస్తామని వినోద్ కుమార్ ప్రకటించారు. కాలేశ్వరం
ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాల్సిందేనని వినోద్ కుమార్ అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో గోదావరి నదిపై కాలేశ్వరం ప్రాజెక్టు, కృష్ణా నదిపై పాలమూరు
రంగారెడ్డి ప్రాజెక్టును నిర్మిస్తున్నందున ఈ రెండు ప్రాజెక్టులలో ఏదో ఒక
దానికి జాతీయ హోదా ఇవ్వాలని 2018 జూలై 20 నాడు తాను కరీంనగర్ ఎంపీగా
పార్లమెంట్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సహా కేంద్ర ప్రభుత్వానికి కోరినట్లు
వినోద్ కుమార్ తెలిపారు. తన మాటలు పార్లమెంటు రికార్డ్స్ లో ఉన్నాయని వాటిని
తెప్పించుకొని కేంద్ర జల శక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ వింటే వాస్తవాలు
నిగ్గు తేలుతాయని వినోద్ కుమార్ స్పష్టం చేశారు. అప్పటి కేంద్ర జల శక్తి శాఖ
మంత్రి నితిన్ గట్కరి సమాధానమిస్తూ దేశంలో ఏ ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా ఇక
ఇవ్వబోమని ప్రకటించారని పార్లమెంట్ లో ప్రకటించారని వినోద్ కుమార్ అన్నారు.
అయితే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటన తర్వాత.. బిజెపి పాలిత రాష్ట్రాలైన
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో కెన్ బెట్వా ప్రాజెక్టుకు రూ. 45,000
కోట్లు, కర్ణాటక రాష్ట్రంలో అప్పర్ భద్ర ప్రాజెక్టుకు రూ.15,000 కోట్లు
కేటాయిస్తూ జాతీయ హోదా ఇస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని, ఇది
కేంద్ర ప్రభుత్వ ద్వంద్వ నీతికి నిదర్శనమని వినోద్ కుమార్ పేర్కొన్నారు.
తెలంగాణ ప్రాజెక్టులకు మాత్రం కేంద్ర ప్రభుత్వం మొండి చేయి ఇచ్చిందని వినోద్
కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.
కాలేశ్వరం ప్రాజెక్టుకు గాని, పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుకు గాని జాతీయ
హోదా ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు రాష్ట్రం
ఏర్పడిన ఐదు రోజుల్లోనే ప్రధాని నరేంద్ర మోడీకి, కేంద్ర మంత్రులను కలిసి
విజ్ఞాపన పత్రాన్ని అందజేశారని, ఇదే క్రమంలో అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి
హరీష్ రావు కూడా పలు మార్లు కేంద్ర ప్రభుత్వానికి, అప్పటి జలశక్తి శాఖ మంత్రి
ఉమా భారతిని కలిసి వినతి పత్రాలను అందజేశారని వినోద్ కుమార్ గుర్తు చేశారు.