బాధితులకు నష్టపరిహారం చెల్లించాలి
సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు
విజయవాడ : పార్వతీపురం మన్యం జిల్లాలో ప్రజల ప్రాణాలకు, పంటలకు,ఆస్తులకు
నష్టం కలిగిస్తున్న ఏనుగులను నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణం
చర్యలు తీసుకోవాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. నిన్న భామిని
మండలం తాలాడ గ్రామంలో ఏనుగుల దాడి వల్ల గోరుచిట్టె చిన్నారావు మృతి చెందడం
పట్ల విచారాన్ని వ్యక్తం చేస్తున్నది. చనిపోయిన చిన్నారావు కుటుంబానికి 25
లక్షల నష్టపరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
మన్యం జిల్లాలో జియ్యమ్మ వలస, కొమరాడ, భామిని, కొత్తూరు మండలాల్లో రెండు
ఏనుగుల గుంపులు తిరుగుతున్నాయి. అయినా ప్రభుత్వ యంత్రాంగం ప్రజలను హెచ్చరిస్తూ
ఏ ప్రకటనా చేయలేదు. 2018 సంవత్సరం నుండి జిల్లాలో 6 మండలాల్లోని గ్రామాల్లో
ఏనుగుల భీభత్సం వల్ల 3 కోట్లు పైగా పంట నష్టం వాటిల్లింది. ఏడుగురు పైగా మృతి
చెందారు. పశువులు కూడా మృత్యువాత పడుతున్నాయి. 4 సంవత్సరాల నుండి ఏనుగులను
తరలించాలని మంత్రులకు, ఫారెస్టు అధికారులకు విజ్ఞప్తులు చేస్తున్నా ఫలితం
లేదని జిల్లా ప్రజానీకం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ప్రాణాలు పోతున్నా
ప్రభుత్వం, అధికారులు నిర్లక్ష్యం వహించడం గర్హనీయం. నిరసన తెలియజేసిన వారిపై
కేసులు మాత్రం పెడుతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రికి ఈ అంశంపై సిపిఐ(యం)
రాష్ట్ర కమిటీ 2022 మే 7న ఉత్తరం కూడా రాసినప్పటికీ ప్రభుత్వ యంత్రాంగంలో చలనం
లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం తన నిర్లక్ష్య ధోరణి విడనాడి ఏనుగులను
తరలించేందుకు తక్షణం చర్యలు తీసుకోవాలని సిపిఐ(యం) డిమాండ్ చేస్తున్నది.
మృతుల కుటుంబాలకు ఒక ఉద్యోగం, 25 లక్షల ఎక్స్గ్రేషియా, పంటలు నష్టపోయిన
రైతులకు ఎకరాకు రు.30వేలు నష్టపరిహారం ఇవ్వాలని సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి
వి.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.