24 వ డివిజన్ 36 వ సచివాలయ పరిధిలో మూడో రోజు గడప గడపకు మన ప్రభుత్వం
విజయవాడ : దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా పింఛన్ దారుల సంక్షేమానికి
వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు,
సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 24 వ డివిజన్ 36 వ వార్డు సచివాలయ
పరిధిలో శనివారం జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో స్థానిక
కార్పొరేటర్ కుక్కల అనితతో కలిసి ఆయన పాల్గొన్నారు. శ్రీహరిరావు వీధి,
కృష్ణారావు వీధులలో విస్తృతంగా పర్యటించి 95 గడపలను సందర్శించారు. గత
చంద్రబాబు అవినీతి పాలనకు, సీఎం వైఎస్ జగన్ సుపరిపాలనకు మధ్య వ్యత్యాసాన్ని
బుక్ లెట్ల ద్వారా స్థానికులకు వివరించారు. తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ సీఎం
వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే కార్యక్రమాలు
చేపడుతున్నారని మల్లాది విష్ణు అన్నారు. ఈ సందర్భంగా అవ్వా,తాతలకు పింఛన్లను
పంపిణీ చేశారు. చంద్రబాబు పాలనలో ఎన్నికల ముందు వరకు కేవలం రూ.వెయ్యి మాత్రమే
పింఛన్ ఇచ్చే వారని గుర్తుచేశారు. కానీ నేడు ఒక్కొక్కరికీ రూ.2,750 చొప్పున
అందిస్తుండటంతో అవ్వాతాతల మోముల్లో ఆనందం వెల్లివిరుస్తోందని చెప్పారు. అనంతరం
మీడియాతో మాట్లాడారు.
టీడీపీ హయాంలో పింఛన్ల వ్యవస్థ అవినీతిమయం
పింఛన్లపై తెలుగుదేశం నాయకులు పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మల్లాది
విష్ణు మండిపడ్డారు. రాష్ట్ర విభజన అనంతరం చంద్రబాబు అధికారంలోకి వచ్చాక
పింఛన్ దార్లకు చుక్కలు చూపించారని ఆరోపించారు. 2014 నుంచి 2015 చివరి వరకు
పాత పింఛనుదారుడు చనిపోతేనే కొత్త ఫించను మంజూరు అన్న విధానాన్ని
కొనసాగించింది వాస్తవం కాదా..? అని ప్రశ్నించారు. పైగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు
చేపట్టిన మూడు నెలలకే టీడీపీ నాయకులు, సానుభూతిపరులతో జన్మభూమి కమిటీలను
ఏర్పాటు చేసి వసూళ్లకు తెర తీశారని దుయ్యబట్టారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యే
నాటికే రాష్ట్రంలో 43.11 లక్షల మంది లబ్ధిదారులు పింఛన్లు పొందుతుండగా.. 2014
సెప్టెంబరు, అక్టోబరు నెలలో నిర్వహించిన జన్మభూమి కమిటీల తనిఖీలతో కోతలు
విధించి 39 లక్షలకు కుదించింది నిజం కాదా..? సమాధానం చెప్పాలన్నారు.
పింఛన్లపై టీడీపీకి శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా..?
తెలుగుదేశం హయాంలో అందించిన పింఛన్లపై శ్వేతపత్రాన్ని విడుదల చేసే దమ్ము పచ్చ
నేతలకు ఉందా..? అని మల్లాది విష్ణు ప్రశ్నించారు. చంద్రబాబు పాలనలో కొత్త
పింఛన్ మంజూరు కావాలంటే అవ్వాతాతలు పడే పాట్లు వర్ణనాతీతమని గుర్తుచేశారు.
ఏళ్లు గడుస్తున్నా దస్త్రం మాత్రం కదిలేది కాదని.. ఆత్మాభిమానాన్ని చంపుకొని
చివరకు జన్మభూమి కమిటీల చుట్టూ తిరగాల్సి వచ్చేదన్నారు. అలాగే పింఛన్
అందుకునేందుకు రోజుల తరబడి పడిగాపులు పడుతూ, చాంతాడంత క్యూలో నిలుచోలేక
నరకయాతన అనుభవించేవారని చెప్పారు. పైగా పింఛన్ డబ్బులలో సగం ఆటో ఖర్చులకే
సరిపోయేవని.. కానీ ఈ ప్రభుత్వం వచ్చాక చిన్న కష్టం కూడా తెలియకుండా, ప్రతి
నెలా ఇంటి వద్దకే వాలంటీర్లు వచ్చి అందిస్తున్నట్లు వెల్లడించారు. పింఛన్
అర్హతను 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గించిన ఘనత కూడా సీఎం జగన్ కే
దక్కుతుందన్నారు. టీడీపీ హయాంలో కేవలం 39 లక్షల మందికి మాత్రమే అందే
పెన్షన్లను.. ఈ ప్రభుత్వం వచ్చాక శాచ్యురేషన్ పద్ధతిలో 63 లక్షలకు పెంచడం
జరిగిందని మల్లాది విష్ణు అన్నారు. ఇందుకోసం నెలకు అక్షరాలా రూ. 1,735.36
కోట్లను రాష్ట్ర ప్రభుత్వం వెచ్చిస్తున్నట్లు తెలిపారు. సెంట్రల్ కి సంబంధించి
చంద్రబాబు హయాంలో 18,331 మాత్రమే పింఛన్లు ఉండేవని గుర్తుచేశారు. ఈ ప్రభుత్వం
అధికారంలోకి రాగానే ఆ సంఖ్యను 25,326 కు పెంచడంతో పాటు ప్రతినెలా 7 కోట్ల 8
లక్షల 71 వేల 250 రూపాయలు పింఛన్ దారులకు అందజేస్తున్నట్లు తెలియజేశారు.
సామాజిక భద్రత పెన్షన్లు అందించడంలో దేశంలో ఏ రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశ్ కు
ధీటుగా రాలేదని మల్లాది విష్ణు అన్నారు. కార్యక్రమంలో ఏఎంఓహెచ్
రామకోటేశ్వరరావు, సీడీఓ జగదీశ్వరి, నాయకులు కుక్కల రమేష్, కొమ్ము చంటి,
బెల్లపు సత్యనారాయణ, కంభంపాటి మోజస్, నాగభూషణం, చింతకాయల చిట్టిబాబు, క్రాంతి,
అన్ని శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.