పిఠాపురం : ఇన్‌ఛార్జిల మార్పుతో వైసీపీలో ధిక్కార స్వరం రోజు రోజుకూ పెరుగుతోంది. శుక్రవారం కాకినాడ జిల్లా పిఠాపురంలో ఎమ్మెల్యే పెండెం దొరబాబు పుట్టినరోజు సందర్భంగా ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు. ఆయన అభిమానులు, కార్యకర్తలు వేలాదిగా తరలిరావడంతో దొరబాబు బలప్రదర్శనకు ఈ కార్యక్రమం వేదికైంది. పిఠాపురం సీటుపై సీఎం జగన్ పునరాలోచించాలి. నియోజకవర్గంలో నాకే ఎక్కువ పట్టుంది. జన్మదిన వేడుకలకు దాదాపు 50వేల మంది హాజరై మద్దతు తెలిపారు. పీఠాపురం టికెట్ మళ్లీ నాకే ఇస్తే భారీ మెజార్టీతో గెలుస్తా. పార్టీ మారుతున్నట్టు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదు. జగన్ ఆలోచించి నాకే సీటు ఇస్తారని ఆశిస్తున్నానని తెలిపారు. దొరబాబు పుట్టిన రోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో సీఎం జగన్ ఫొటో లేకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కాకినాడ ఎంపీగా ఉన్న వంగా గీతను ఇప్పటికే పిఠాపురం పార్టీ ఇన్ఛార్జిగా అధిష్ఠానం నియమించింది. దీంతో అప్పటినుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే దొరబాబు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. జనసేనలోకి వెళ్తారని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది.