నెల్లూరు : మంచి ఆరోగ్యం, నడవడికతో మాత్రమే ఎవరికైనా కీర్తి ప్రతిష్టలు
లభిస్తాయని, ఐశ్వర్యంతో కాదని, ఈ విషయాన్ని గుర్తించి తమ పిల్లలను క్రీడల వైపు
ప్రోత్సహించేలా తల్లిదండ్రుల్లో మార్పు రావాలని రాష్ట్ర వ్యవసాయ, సహకార, ఫుడ్
ప్రాసెసింగ్ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఉద్బోధించారు. నగరంలోని ఏసీ
సుబ్బారెడ్డి స్టేడియంలో రాష్ట్రస్థాయి జగనన్న క్రీడా సంబరాల్లో భాగంగా జిల్లా
క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి పోటీలను జాయింట్
కలెక్టర్ కూర్మనాథ్, నుడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్, జిల్లాస్థాయి
అధికారులతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో
మంత్రి మాట్లాడుతూ తల్లిదండ్రులు కేవలం ర్యాంకులు చూసి కార్పొరేట్ పాఠశాలల్లో
తమ పిల్లలను చేర్పిస్తున్నారని, బాగా చదివి గొప్ప ఉద్యోగం పొంది డబ్బులు
సంపాదించాలని కోరుకుంటున్నారే కానీ బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని
ప్రయత్నించడం లేదన్నారు.
విద్యతో పాటు క్రీడల వైపు కూడా విద్యార్థులను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా
ఉందన్నారు. ఈ దిశగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల్లో మార్పు రావాలని, ప్రతిఒక్క
విద్యార్థి క్రీడలపట్ల ఆసక్తి చూపేలా వారిని ప్రోత్సహించాలన్నారు. ప్రతిరోజు
వ్యాయామం చేయడం, క్రీడల్లో పాల్గొనడం విద్యార్థుల దినచర్యలో ఒక భాగం
కావాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా క్రీడాకారులను ఉత్తేజపరచాలనే ఉద్దేశంతో
ముఖ్యమంత్రి జగనన్న క్రీడా సంబరాలకు శ్రీకారం చుట్టడం శుభ పరిణామమన్నారు.
గతంలో దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో సీఎం కప్ పోటీలు జరిగాయని,
మళ్లీ ఇప్పుడు ఆయన తనయుడు ఈ పోటీలను నిర్వహించడం హర్షించదగ్గ విషయం అన్నారు.
రాష్ట్రస్థాయి సీఎం కప్-2022 పోటీల్లో సత్తా చాటి జిల్లా కీర్తి పతాకాన్ని
రెపరెపలాడించాలని మంత్రి పిలుపునిచ్చారు. జాయింట్ కలెక్టర్ కూర్మనాథ్
మాట్లాడుతూ మానసిక ఉల్లాసానికి, శారీరక దృఢత్వానికి క్రీడలు ప్రతి ఒక్కరికి
ఎంతో అవసరమని, పిల్లలందరూ ప్రతిరోజు వ్యాయామం చేయడం, క్రీడల్లో పాల్గొనేలా
వారిని తల్లిదండ్రులు ప్రోత్సహించాలన్నారు. కేవలం విద్య మాత్రమే కాదని క్రీడలూ
ఎంతో ముఖ్యమని, క్రీడాకారులందరూ సీఎం కప్ పోటీల్లో రాణించి జిల్లాకు మంచి పేరు
తేవాలని ఆయన ఆకాంక్షించారు.
తొలుత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి, అధికారులకు క్రీడాకారులు
క్రీడాభివందనం చేశారు. అనంతరం క్రికెట్, వాలీబాల్, కబడ్డీ జిల్లాస్థాయి
పోటీలను మంత్రి ప్రారంభించి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో నుడా
చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్, డి ఆర్ డి ఏ పిడి సాంబశివారెడ్డి, సెట్నాల్
సీఈవో పుల్లయ్య, చీఫ్ కోచ్ యతిరాజ్, డి ఎం హెచ్ ఓ పెంచలయ్య, ఆర్ ఐ ఓ
వరప్రసాద్, ఇన్ఛార్జి డిఈఓ సుబ్బారావు, డిస్టిక్ యూత్ ఆఫీసర్ మహేందర్
రెడ్డి,నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇంచార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి,
రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ డైరెక్టర్ కాలువ నర్సింహులు, జిల్లా ఒలంపిక్
అసోసియేషన్ విజయ్ కుమార్, వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు పాల్గొన్నారు.