న్యూఢిల్లీ : పీఎం గతిశక్తి కింద ఆంధ్రప్రదేశ్‌కు 202 కోట్లు మంజూరు
చేసినట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి సోం ప్రకాష్ తెలిపారు.
రాజ్యసభలో శుక్రవారం వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు
మంత్రి రాతపూర్వకంగా బదులిస్తూ ఈ విషయం తెలిపారు. 5 వేల కోట్ల వ్యయంతో
రూపొందించిన ప్రధానమంత్రి గతిశక్తి పథకం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 202
కోట్లు కేటాయించినట్లు మంత్రి చెప్పారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం
రాష్ట్రాలకు స్పెషల్ అసిస్టెన్స్ ఫర్ కేపిటల్ ఇవెస్టిమెంట్ స్కీం కింద
రాష్ట్రాలకు వడ్డీ లేకుండా దీర్ఘకాలిక రుణాల మంజూరుకు లక్ష కోట్ల రూపాయలు
అదనంగా కేటాయించినట్లు ఆయన తెలిపారు. పీఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్
అనేది జీఐఎస్ ఆధారిత డిజిటల్ కాంపోనెంట్. అందులో వివిధ మంత్రిత్వ శాఖలు,
డిపార్ట్మెంట్లకు సంబంధించిన పోర్టల్స్ ను 2021 అక్టోబర్‌లో ప్రారంభించినట్లు
మంత్రి తెలిపారు.
ఏకీకృత ప్రణాళిక రూపొందించడం, ప్రాజెక్టుల ప్రాధాన్యతను గుర్తించడం, ఏకకాలంలో
అమలు పరచడం, ఖర్చులు, సమయం ఆదా చేయడం ప్రాజెక్టు మానిటరింగ్ పథకం లక్ష్యాలని
చెప్పారు, వివిధ మంత్రిత్వ శాఖలు, డిపార్ట్మెంట్ల ద్వారా దేశ వ్యాప్తంగా
వివిధ ఎకనమిక్ జోన్లకు మల్టీ మోడల్ కనెక్టివిటీని అభివృద్ధి చేసి తద్వారా
లాజిస్టిక్ వ్యయం ఆదా చేయడం ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. మెరుగైన నిర్ణయాలు
తీసుకునేందుకు, వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలు, డిపార్ట్మెంట్ల మధ్య సమన్వయం
కోసం కేబినెట్ సెక్రటరీ అధ్యక్షతన ఎంపవర్డ్ గ్రూప్ ఆఫ్ సెక్రటరీస్
(ఈజీఓఎస్)తో నెట్ వర్క్ ప్లానింగ్ గ్రూప్‌ను సంస్థాగతంగా ఏర్పాటు చేసినట్లు
తెలిపారు. ఇందులో కేంద్ర మంత్రిత్వ శాఖలు, డిపార్టుమెంట్లు, రాష్ట్ర
ప్రభుత్వాలకు సంబందించి సుమారు 2000 డేటా లేయర్లు అప్లోడ్ చేసినట్లు
తెలిపారు. కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వశాఖలు, డిపార్టుమెంట్ల ద్వారానే కాకుండా
ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ డిపార్లమెంట్ ప్రాజెక్ట్
మాటనిటరింగ్ గ్రూపుల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు మంత్రి సోం ప్రకాష్
తెలిపారు.
డేటా ప్రొటెక్షన్ బిల్లుపై సంప్రదింపులు
న్యూఢిల్లీ : ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు-2022 పేరుతో ఒక ముసాయిదా బిల్లును
రూపొందించిందని, ప్రస్తుతం ఈ ముసాయిదా బిల్లు సంప్రదింపుల దశలో ఉందని కేంద్ర
ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్
వెల్లడించారు. రాజ్యసభలో శుక్రవారం విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు
రాతపూర్వకంగా బదులిస్తూ డేటా ప్రొటెక్షన్ బిల్లులో వినియోగదారుల హక్కులు,
విధులు, వారి వ్యక్తిగత సమాచార భద్రత, ఫిర్యాదు విధానం వంటి అంశాలను
పొందుపరిచినట్లు మంత్రి తెలిపారు.
గూగుల్ ద్వారా వినియోగదారుని లొకేషన్ అక్రమంగా ట్రాకింగ్ చేస్తున్న విషయం మీ
దృష్టికి వచ్చిందా? దీనిని అరికట్టేందుకు ఎటువంటి చర్యలు చేపడుతున్నారు? అన్న
ప్రశ్నకు మంత్రి బదులిస్తూ ఇతర దేశాల్లో గూగుల్ ద్వారా వినియోగదారుల లొకేషన్
అక్రమంగా ట్రాకింగ్ చేస్తున్నట్లు మీడియా కథనాల ద్వారా తమ దృష్టికి వచ్చింది.
అయితే అటువంటి సంఘటనలు మన దేశంలో జరిగినట్లు ఎటువంటి ఫిర్యాదులు తమ దృష్టికి
రాలేదని మంత్రి చెప్పారు.