చిత్తూరు జిల్లా పుంగనూరులో నిన్న టీడీపీ శ్రేణులపై రాళ్ల దాడి నిరసిస్తూ
అనంతపురంలో శాంతియుత నిరసనలకు టీడీపీ పిలుపు
ఎక్కడికక్కడ నాయకులను గృహనిర్బంధం చేసిన పోలీసులు
తనను అడ్డుకోవడంతో రోడ్డుపైనే నిరసన తెలిపిన సునీత
మాజీ మంత్రి పరిటాల సునీతను అరెస్ట్ చేసిన పోలీసులు
అనంతపురం : చిత్తూరు జిల్లా పుంగనూరులో టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ
దాడిని నిరసిస్తూ ఆందోళనకు దిగిన మాజీ మంత్రి పరిటాల సునీతను పోలీసులు అరెస్ట్
చేశారు. ఎన్ఎస్ గేట్ వద్ద నిరసన చేసేందుకు వెళుతున్న సునీతను మరూరు టోల్
ప్లాజా వద్ద పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ టోల్
ప్లాజా వద్ద పరిటాల సునీత, టీడీపీ నేతలు, కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి
నిరసనకు దిగారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
చిత్తూరు జిల్లా పుంగనూరులో రాళ్ల దాడిని నిరసిస్తూ అనంతపురం జిల్లాలో టీడీపీ
నాయకులు చేపట్టిన శాంతియుత నిరసనలపై పోలీసులు ఆంక్షలు విధించారు. నిరసనలకు
అనుమతి లేదంటూ అడ్డగించారు. ఎక్కడికక్కడ నాయకులను గృహనిర్బంధం చేశారు. ఈ
నేపథ్యంలో చెన్నేకొత్తపల్లిలో నిరసన తెలిపేందుకు వెళ్తున్న టీడీపీ నేత,
రాప్తాడు మాజీ ఎమ్మెల్యే పరిటాల సునీతను పోలీసులు అడ్డుకున్నారు. నిరసనలకు
అనుమతి లేదంటూ 44వ జాతీయ రహదారిపై మరూరు టోల్గేట్ వద్ద నిలిపేశారు.
శాంతియుతంగా నిరసనలు తెలిపేందుకే వెళ్తున్నామని పరిటాల సునీత చెప్పినా
పోలీసులు అనుమతించలేదు. దీంతో సునీత రోడ్డుపైనే బైఠాయించారు. పోలీసుల తీరుపై
తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు హిందూపూరంలో కూడా టీడీపీ నాయకులను
అడ్డుకున్నారు.
ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ చంద్రబాబుపై రాళ్లు వేస్తే పోలీసులు అడ్డుకోరు
కానీ.. తమను మాత్రం అడ్డుకుంటారని మండిపడ్డారు. పోలీసుల తీరుపై సునీత తీవ్ర
ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పర్యటనలో పోలీసులే టీడీపీ వారిపై రాళ్ల దాడి
చేశారని ఆరోపించారు. చంద్రబాబు ఒక్క మాట చెబితే వైఎస్ఆర్ గూండాలు రోడ్ల మీద
తిరగలేరని హెచ్చరించారు. ‘‘మా ప్రాణాలు పోయినా సరే మిమ్మల్ని రక్షించుకుంటాం.
మీరు కనుసైగ చేయండి సర్. వీరి కథ మేము చూసుకుంటాం అంటూ చంద్రబాబును కోరారు.
‘పెద్దిరెడ్డి మీరు మీ ఇంటికి పెద్ద కావచ్చు.. మాకు కాదు. ఇప్పుడు చేస్తున్న
వాటికి మూల్యం చెల్లించుకుంటారని పరిటాల సునీత హెచ్చరించారు.