దాడులకు పాల్పడిన వారిని గుర్తించామన్న డీజీపీ
హింస వెనుక ఎవరున్నారనే విషయంలో ప్రాథమిక సమాచారం ఉంది
చంద్రబాబు రూట్ ప్లాన్ మారిన విషయం దర్యాప్తులో తేలుతుంది
ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి
గుంటూరు : పుంగనూరులో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై ఆంధ్రప్రదేశ్ డీజీపీ
రాజేంద్రనాథ్ రెడ్డి విచారణకు ఆదేశించారు. లోతుగా విచారణ జరపాలని డీఐజీ
అమ్మిరెడ్డి, చిత్తూరు జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డిలకు ఆదేశాలు జారీ చేశారు.
డీజీపీ మాట్లాడుతూ టీడీపీ కార్యకర్తల దాడిలో పోలీసులు గాయపడ్డారని అన్నారు.
వాహనాలను కూడా తగలబెట్టారని చెప్పారు. వాహనాల ధ్వంసం చేసిన వారిని, రాళ్లు
రువ్విన వారిని గుర్తించామని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించిన వారందరిపై కఠిన
చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ హింస వెనుక ఎవరున్నారనే విషయంలో ప్రాథమిక
సమాచారం ఉందని డీజీపీ చెప్పారు. రెచ్చగొట్టే ప్రసంగాలపై దృష్టి సారించామని
తెలిపారు. చంద్రబాబు రూట్ ప్లాన్ మారిన విషయం కూడా దర్యాప్తులో తేలుతుందని
చెప్పారు. మరోవైపు 30 మంది టీడీపీ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
వీరిపై ఐపీసీ 147, 148, 332, 353, 128బీ సెక్షన్ల కింద కేసులు పెట్టారు.