సత్తెనపల్లి : పుంగనూరు విధ్వంసానికి చంద్రబాబే కారణమని జలవనరులశాఖ మంత్రి
అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. సత్తెనపల్లి వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయం
నుంచి మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్మోహన్రెడ్డి అధికారంలోకి
వచ్చాక రాయలసీమకు ద్రోహం చేశారనే దుష్ప్రచారం చేసేందుకు చంద్రబాబు పుంగనూరుకి
వెళ్ళారని తెలిపారు. ఆ ప్రాంతంలో హింసను ప్రోత్సహించి ప్రభుత్వాన్ని
అస్థిరపరచాలని కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం
హయాంలో పుంగనూరు, తంబళ్లపల్లె, మదనపల్లి, పీలేరు ప్రాంతాలను సస్యశ్యామలం
చేసేందుకు రాయలసీమలో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను ప్రారంభించిందని, భారీ
నీటి ప్రాజెక్టులతో పాటు పలు చిన్న-చిన్న డ్యామ్‌లను కూడా కడుతున్నామని
అన్నారు. ఈ ప్రాజెక్టులను అడ్డుకునేందుకు చంద్రబాబు గ్రీన్ ట్రిబ్యునల్ కు
వెళ్లి స్టే తెచ్చారు. ఈ విషయాన్ని అర్థం చేసుకున్న అక్కడి ప్రజలు ఆయనను
అడ్డుకునేందుకు ప్రయత్నించారని చెప్పారు. పోలీసులు కూడా పుంగనూరు రావొద్దని
చెప్తే మొదట చంద్రబాబు అంగీకరించారని, పుంగనూరు ఊరిలోకి కాకుండా బైపాస్‌లో
వెళ్లేందుకు ఒప్పుకున్నారని అన్నారు. చివరిలో పుంగనూరు వెళ్తానని బాబు
పట్టుబట్టడంతో తప్పని పరిస్థితుల్లో పోలీసులు అడ్డుకున్నారని వెల్లడించారు.
దీంతో అడ్డుకున్న పోలీసులపై రాళ్ళు, బీరు బాటిల్స్ తో దాడి చేయించారని
మండిపడ్డారు.