పశ్చిమ బెంగాల్‌లోని గంగాసాగర్‌లో ఘటన
పుణ్యస్నానాల కోసం రెండు నౌకల్లో గంగాసాగర్‌కు
దట్టమైన పొగమంచు, అలలు తక్కువగా ఉండడంతో చిక్కుకుపోయిన నౌకలు
గంగాసాగర్‌లో పుణ్యస్నానానికి వెళ్లిన 600 మంది భక్తులు బంగాళాఖాతంలో
చిక్కుకుపోయారు. పశ్చిమ బెంగాల్‌లోని 24 పరగణాల జిల్లాలో జరిగిందీ ఘటన. హుగ్లీ
నది బంగాళాఖాతంలో కలిసే చోటును గంగాసాగర్‌గా పిలుస్తుంటారు. ఇక్కడ ప్రతి
సంవత్సరం సంక్రాంతి రోజున లక్షలాదిమంది పుణ్య స్నానాలు ఆచరిస్తారు. ఈసారి కూడా
పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. గంగాసాగర్‌లో పుణ్యస్నానాల కోసం 600
మందికిపైగా యాత్రికులతో బయలుదేరిన రెండు నౌకలు ఎంవీ లచ్చమతి, ఎంవీ అగరమతి కాక్
ద్వీపం వద్ద చిక్కుకుపోయాయి. ద్వీపానికి సమీపంలో దట్టమైన పొంగమంచు, అలలు
తక్కువగా ఉండడంతో నౌకలు ముుందుకు కదల్లేకపోయాయి. దీంతో ఆదివారం రాత్రంతా
యాత్రికులు అక్కడే ఉండిపోయారు. సమాచారం అందుకున్న కోస్టుగార్డు సిబ్బంది
పడవలను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.