రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ఎక్కువ నష్టపోయింది వాళ్ళే
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ
కీవ్ : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను ప్రపంచంలో చాలా మంది చంపాలని
చూస్తున్నారని, తనతో పోలిస్తే ఆయన ప్రాణాలకే ఎక్కువ ముప్పు ఉందని ఉక్రెయిన్
అధ్యక్షుడు జెలెన్స్కీ అన్నారు. ‘‘ప్రస్తుత పరిస్థితి నాకంటే పుతిన్‌కే
ఎక్కువ ప్రమాదకరంగా ఉంది. రష్యాలో మాత్రమే నన్ను చంపాలనుకుంటున్నారు.
పుతిన్‌ను ప్రపంచంలో చాలా మంది హత్య చేయాలని చూస్తున్నారు’’ అని ఓ స్పెయిన్
పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. యుద్ధంలో వాగ్నర్ ముఠాకు తమ
సైన్యం చుక్కలు చూపించిందని చెప్పారు. ‘‘మా దళాలు దాదాపు తూర్పు
ఉక్రెయిన్‌లోనే 21,000 మంది వాగ్నర్ సైనికులను హతమార్చాయి. మరో 80,000 మందిని
గాయపరిచాయని వెల్లడించారు.
12 రోజుల తర్వాత మళ్లీ కీవ్‌పై : దాదాపు 12 రోజుల వ్యవధి తర్వాత రష్యా మరోసారి
ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై డ్రోన్లతో విరుచుకుపడింది. మరోసారి శత్రువులు దాడి
చేశారు. ఈ సారి ఎటువంటి ఆస్తి, ప్రాణనష్టం లేదని కర్నల్ జనరల్ సెర్హీ
పాప్కోవ్ టెలిగ్రామ్ ఛానెల్లో వెల్లడించారు. స్పెయిన్ ప్రధాని పర్యటన
సమయంలో ఈ దాడులు జరగడం గమనార్హం.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ఎక్కువ నష్టపోయింది వాళ్ళే : ఉక్రెయిన్ అధ్యక్షుడు
వ్లాదిమిర్ జెలెన్స్కీ స్పెయిన్ మీడియా నిర్వహించిన ఒక సమావేశంలో మాట్లాడుతూ
రష్యాతో జరుగుతున్న యుద్ధంలో తిరుగుబాటు సైన్యమైన వాగ్నర్ గ్రూపుకు సంబంధించిన
సుమారు 21000 మందిని చంపామని మరో 80,000 మంది గాయపడి ఉంటారని నిర్ధారించారు.
పదహారు నెలలుగా సాగుతున్న యుద్ధంలో బలమైన రష్యాను ఉక్రెయిన్ సమర్థవంతంగానే
ఎదుర్కొంది. రష్యా ఆక్రమించుకున్న ఒక్కో ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం
చేసుకుంటూ ఉక్రెయిన్ ముందుకు సాగుతోంది. ఈ సందర్బంగా స్పానిష్ మీడియా
సమావేశంలో పాల్గొన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు వారడిగిన కొన్ని సందేహాలకు
సమాధానమిచ్చారు. యెవ్గెనీ ప్రిగోజిన్ నేతృత్వంలోని వాగ్నర్ గ్రూపు చేసిన
తిరుగుబాటు ప్రస్తావన రాగా రష్యాతో జరిగిన యుద్ధంలో వారు కూడా ఎక్కువగానే
నష్టపోయారని తెలిపారు.
తూర్పు ఉక్రెయిన్ ప్రాంతంలో జరిగిన యుద్ధంలో రష్యా ప్రేరేపిత సైన్యమమైన
వాగ్నర్ గ్రూపుకు చెందిన సుమారు 80000 మంది గాయాల పాలవగా దాదాపు 21000 మందిని
మట్టుబెట్టామని అన్నారు. శత్రువును మా నేల మీద నుండి తరిమేయడమే మా ముందున్న
ప్రధమ కర్తవ్యమని తెలిపారు. ఈ యుద్ధ నేపథ్యంలో మీ ప్రాణానికి హాని ఉంది భయంగా
లేదా..? అని ఓ విలేఖరి ప్రశ్నించగా నాకంటే రష్యా అధ్యక్షుడికే ఎక్కువగా
ప్రాణహాని ఉందని, నన్ను చంపాలనే ఉద్దేశ్యం ఆయనకు తప్ప ఎవరికీ లేదని, కానీ
ఆయనను చంపాలని ప్రపంచ దేశాలు కోరుకుంటున్నాయని అన్నారు.
ఇదిలా ఉండగా జూన్ 29న రష్యా సైన్యం పైన తిరుగుబాటు చేసిన వాగ్నర్ గ్రూపు రష్యా
అధ్యక్షుడికి కంటి మీద కునుకు లేకుండా చేసిన విషయం తెలిసిందే. బెలారస్
అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాశెంకో చొరవ తీసుకుని మధ్యవర్తిత్వం చేయడంతో
యెవ్గేనీ ప్రిగోజిన్ దళాలు శాంతించి వెనక్కు మళ్ళిన విషయం తెలిసిందే. కాగా
రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రిగోజిన్ దళాలకు మూడు ప్రత్యామ్నాయాలు విధించినట్లు
రష్యాతో తిరిగి ఒప్పందం కుదుర్చుకోవాలని, యధావిధిగా పౌరసత్వాన్ని
కొనసాగించాలని లేదా బెలారస్ కు తరలిపొమ్మని సూచించినట్లు మీడియా వర్గాలు
చెబుతున్నాయి.