విజయవాడ : బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి మార్పుపై సీపీఐ నేత రామకృష్ణ
స్పందించారు. సోము వీర్రాజుపై అనేక ఆరోపణలు వచ్చాయని, వైసీపీకి అనుకూలంగా
పని చేశారనే భావన ఉందని తెలిపారు. అందుకే ఆయన్ని తప్పించి పురంధరేశ్వరికి
ఇచ్చారని అనుకుంటున్నానని అన్నారు. సత్యకుమార్, రమేష్ పేర్లు వినిపించినా
వారికి ఇవ్వలేకే ఆమెకు ఇచ్చారన్నారు. పురంధరేశ్వరికి ఇచ్చినా ఏపీలో బీజేపీ బలం
పెరగదని స్పష్టం చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డికి బీజేపీ పెద్దల అండ
పుష్కలంగా ఉందన్నారు. ఆయన అడిగినప్పుడు నిధులు ఇస్తారని, కేసుల్లో బెయిల్
ఇస్తారని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డికి కేంద్ర పెద్దల సహకారం లేదని ఎవరైనా
చెప్పగలరా అని ప్రశ్నించారు. పొత్తుల విషయంలో ఎవరి అంచనాలు వారివన్నారు.
పురంధరేశ్వరి రామారావు కుమార్తె అయినా బీజేపీతో ఎన్టీఆర్కు ఏం సంబంధం అని
నిలదీశారు. బీజేపీతో చంద్రబాబు పొత్తు పెట్టుకుంటాడని తాను అనుకోవడం లేదని
రామకృష్ణ పేర్కొన్నారు.