అమరావతి : పెట్టుబడుల ఆకర్షణకు ప్రయత్నించాలని ముఖ్యమంత్రి వైయస్.జగన్
మోహన్ రెడ్డి కోరారు. విశాఖపట్నంలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు సందర్భంగా
జరుగుతున్న ఏర్పాట్లపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్.జగన్ సమీక్ష
నిర్వహించారు. మార్చి 3, 4 తేదీల్లో విశాఖపట్నంలోని ఏయూ గ్రౌండ్స్‌లో గ్లోబల్
ఇన్వెస్టర్స్ సదస్సు జరగనుంది. పారిశ్రామిక రంగానికి రాష్ట్రంలో ఉన్న
అవకాశాలు, సానుకూలతలను ఈ సదస్సు వేదికగా ప్రభుత్వం వివరించనుంది. తద్వారా
పెట్టుబడుల ఆకర్షణకు ఈ సదస్సును రాష్ట్ర ప్రభుత్వం వేదిక చేసుకోనుంది.
కార్యక్రమాల షెడ్యూల్‌ను సీఎంకు అధికారులు వివరించారు. వేదిక వద్ద జరుగుతున్న
పనులు తదితర అంశాలతో పాటు ఈ సదస్సుకు వస్తున్న కేంద్రమంత్రులు, వ్యాపారవేత్తలు
తదితర వివరాలను సీఎంకు అధికారులు వివరించారు.
సదస్సు నిర్వహణలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కొన్ని సూచనలు చేశారు. ఉదయం
అల్పాహారంతో తొలిరోజు కార్యక్రమం ప్రారంభం అవుతుంది. 10 గంటల ప్రాంతంలో
సదస్సు ప్రారంభమవుతుంది. కీలక అంశాలపై సదస్సునుద్దేశించి పారిశ్రామిక
దిగ్గజాలు, వ్యాపారవేత్తలు ప్రసంగిస్తారు. తర్వాత కంపెనీలతో అవగాహనా
ఒప్పందాలు, దీనితర్వాత వివిధ పారిశ్రామిక రంగాలపై సెషన్లు, వ్యాపారవేత్తలతో
ముఖాముఖి సీఎం చర్చలు జరుపుతారు. సదస్సు ప్రాంగణంలో ఎగ్జిబిషన్ ఏర్పాటు
చేస్తారు. తొలిరోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమం. తొలిరోజు రాత్రి సభకు
హాజరైన వారికి ఇచ్చే విందులో ముఖ్యమంత్రి పాల్గొంటారు. రెండోరోజున
వాలెడిక్టరీ సెషన్ ఉంటుంది. ఈ సెషన్లో పలువురు ప్రముఖులు పాల్గొంటారు. రెండో
రోజున పలు కంపెనీలతో అవగాహనా ఒప్పందాలు జరుగుతాయి. ముఖ్యమంత్రి చేసిన సూచనలను
పరిగణలోకి తీసుకుని మొత్తంగా షెడ్యూల్ ఖరారు చేసే పనిలో అధికారులు
నిమగ్నమయ్యారు. ఈ సమావేశంలో పరిశ్రమలశాఖ స్పెషల్ సీఎస్ కరికాల వలవెన్,
ఆర్ధికశాఖ స్పెషల్ సీఎస్ ఎస్ ఎస్ రావత్, సమాచారశాఖ కమిషనర్ టి విజయ్‌కుమార్
రెడ్డి, ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు పాల్గొన్నారు.