రాజ్యసభ సభ్యులు, వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి
విజయవాడ : పేదరిక నిర్మాలన, ఆర్ధిక అసమానతులు తగ్గించడం వంటి జోడు లక్ష్యాలను
సాధించేందుకు జగన్మోహన్ రెడ్డి సరధ్యంలోని అంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయవంతంగా
ముందుకు సాగుతోందని రాజ్యసభ సభ్యులు, వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి
విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. సోషల్ మీడియా వేదికగా శనివారం ఈ అంశంపై రాసిన
వ్యాసంలో అనేక విషయాలు వెల్లడించారు. ఇండియాలో దారిద్య్ర రేఖ దిగువున ఎన్ని
కోట్ల మంది ఉన్నారనే విషయమై ఏకాభిప్రాయం లేదు. ఇప్పుడు దేశంలో పేదలు 4 కోట్లు
మంది మాత్రమేనని కొందరు ఆర్థిక నిపుణులు అంచనా వేస్తుంటే, మరి కొందరు
ఆర్థికవేత్తలు వారి సంఖ్య 37 కోట్ల వరకూ ఉంటుందని అంటున్నారని అన్నారు. గత
మూడు దశాబ్దాల్లో భారతదేశంలో పేదరికం గణనీయంగా తగ్గిన మాట వాస్తవమేనని అందరూ
అంగీకరిస్తున్నారు. కాని, భారత పౌరుల్లో ఎంత మంది పేదలు అనే అంశంపైనే కొంత
వివాదం. పేదరిక నిర్మూలన కంటే 140 కోట్ల జనాభా దాటిన దేశంలో ఆర్థిక అసమానతలు
రూపుమాపడమే ప్రధానమని ఎక్కువ మంది ఆర్థిక శాస్త్రవేత్తలు వాదిస్తున్నారని
అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో నాలుగేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన వైఎస్సార్
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మొదటి రోజు నుంచీ ధనికులు, పేదల మధ్య తేడాలు
తగ్గించడంపైనే దృష్టి కేంద్రీకరించిందని అన్నారు. పేదరిక నిర్మూలనకు తగినన్ని
గట్టి ప్రణాళికలు అమలు చేస్తూనే ఐదున్నర కోట్ల ప్రజల మధ్య అసమానతలు
తొలగించడానికి 2019 ఏప్రిల్–మే ఎన్నికల ముందే నవరత్నాల పేరుతో వైఎస్సార్
కాంగ్రెస్ పార్టీ అనేక సంక్షేమ పథకాలు రూపొందించిందని అన్నారు . దారిద్య్రం
ఎంతటి దుర్భరమైనదో, సమాజానికి ఎంతటి ప్రమాదకరమైనదో సామాజికశాస్త్రవేత్తలు
ఎప్పటి నుంచో వివరిస్తున్నారని అన్నారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే,
ఒకే ప్రాంతంలో, ఒకే భాష మాట్లాడే జనం మధ్య కొనసాగే ఆర్థిక అసమానతలు కూడా అంతే
ప్రమాదకరమైనవని అన్నారు. ఆదాయ, వనరుల్లో తేడాలు వివిధ వర్గాల ప్రజల మధ్య హింస,
విద్వేషాలకు దారితీసే ముప్పు ఎప్పుడూ ఉంటుంది. అందుకే ముఖ్యమంత్రి వైఎస్
జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం పేదలు, అల్పాదాయ వర్గాల బ్యాంకు
ఖాతాల్లో నగదు మొత్తాలు పెరగడానికి, వారి కొనుగోలు శక్తిని మునుపెన్నడూ లేని
విధంగా బలోపేతం చేయడానికి అనేక సంక్షేమ నగదు బదిలీ కార్యక్రమాలు అమలు
చేస్తోందని అన్నారు. పకడ్బందీగా చేస్తున్న ఈ కార్యక్రమాలు కొత్తగా అనేక మంది
పేద ప్రజలకు దారిద్య్రం నుంచి విముక్తి కల్పిస్తున్నాయని విజయసాయి రెడ్డి
అన్నారు.
ఆర్థిక అసమానతలు రూపుమాపడానికి 2019 ఆగస్టు 15నే ప్రతిన పూనిన ఏపీ
2019 ఆగస్టు 15న విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో
జాతీయ జెండా ఆవిష్కరించాక సీఎం జగన్ తన తొలి స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం
చేస్తూ, ‘‘ఇండియాలో రాజకీయ, ఆర్థిక, సామాజిక అసమానతలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి.
దేశంలో 27 శాతం ప్రజలు నిరక్షరాస్యులు. రాష్ట్రంలో వారి సంఖ్య 33%. ఆంధ్ర
రాష్ట్రంలో పేదలకు సైతం విద్య అందుబాటులోకి రావాలి. వారి కోసం వచ్చే ఏడాది
జనవరి నుంచి అమ్మ ఒడి పథకం ప్రవేశపెడుతున్నాం,’ అని ప్రకటించిన విషయాన్ని
గుర్తుచేశారు. అన్ని రంగాల్లో తెలుగునాట ప్రజల మధ్య అసమానతలు సాధ్యమైనంత వరకు
తగ్గించడమే తన లక్ష్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ సర్కారు గత నాలుగు
సంవత్సరాలుగా పనిచేస్తోందని అన్నారు. పాతిక పైగా ఉన్న సంక్షేమ పథకాలను నగదు
బదిలీ ప్రక్రియ ద్వారా అమలు చేయడం వల్ల పేదరికం తగ్గడంతో పాటు జనం ఆదాయాల్లో
వ్యత్యాసాలు నెమ్మదిగా తగ్గుతున్నాయని అనేక సర్వేలు చెబుతున్నాయని అన్నారు.
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా 2021 డిసెంబర్ చివరిలో ప్రధాని
నరేంద్రమోదీ ఏర్పాటు చేసిన వర్చువల్ సమావేశంలో పాల్గొంటూ, ‘స్థిరమైన
అభివృద్ధి సాధించడానికి, ఆర్థిక అసమానతలు తగ్గించడానికి దేశ ఆర్థిక వ్యవస్థలో
అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలి,’ అని జగన్ మోహన్ రెడ్డి గారు
పిలుపునిచ్చారని గుర్తుచేశారు. ప్రజలకు ఉచితంగా చదువు అందేలా చూడడమేగాక,
అవసరమైన పౌరులందరికీ ఆహారధాన్యాలు అందుబాటులోకి తీసుకురావాలని ఆయన కోరారని
అన్నారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారానే దేశంలో, ఏపీలో ఆర్థిక అసమానతలు
రూపుమాపవచ్చనేది ఆయన అభిప్రాయమని తెలిపారు. ఈ అభిప్రాయానికి, వైఎస్సార్సీపీ
ఎన్నికల ప్రణాళికకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం లక్షలాది మంది రాష్ట్ర
ప్రభుత్వ ఉద్యోగులు, గ్రామ, వార్డు వలంటీర్లు, స్థానిక సచివాలయాల కార్యదర్శుల
కృషితో అనేక పథకాలు అమలు చేస్తోందని అన్నారు. ఈ సంక్షేమ కార్యక్రమాలు ఇలాగే
మరో పదేళ్లు కొనసాగితే ఆంధ్రలో ఆదాయ వ్యత్యాసాలు, ఆర్థిక అసమానతలు
తొలగిపోతాయని విజయసాయిరెడ్డి అన్నారు.