ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆస్పత్రులపై అవగాహనకై హెల్ప్ డెస్క్ ఏర్పాటు
రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ మల్లాది విష్ణు
ఎమ్మెల్యే చేతులమీదుగా రూ. 3.95 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల అందజేత
విజయవాడ : వైద్య రంగంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొస్తున్న
సంస్కరణలు పేదలకు ఎంతో మేలు చేకూరుస్తున్నాయని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్
చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. నియోజకవర్గ పరిధిలో
కొత్తగా 8 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన రూ. 3.95
లక్షల విలువైన చెక్కులను సోమవారం ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనములో ఆయన
పంపిణీ చేశారు. ప్రజల ఆరోగ్యం పట్ల వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో
అడుగులు వేస్తోందని ఈ సందర్భంగా మల్లాది విష్ణు వెల్లడించారు.
డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం కింద 2,200 కి పైగా ఆస్పత్రులలో 3,255
చికిత్సలను పేదలకు ఉచితంగా అందిస్తున్నట్లు వివరించారు. ఇందుకోసం ఏటా రూ. 3
వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. శస్త్ర చికిత్స అనంతరం ఆరోగ్య ఆసరా
కింద రోగులకు ఆర్థిక సహకారం అందించడం జరుగుతోందన్నారు. నాడు-నేడు కింద రూ. 16
వేల కోట్లతో వైద్య రంగం రూపురేఖలు మారుస్తున్నట్లు పేర్కొన్నారు. రూ. 8,500
కోట్లతో 17 కొత్త వైద్య కళాశాలలను ఏర్పాటు చేస్తూ ఆరోగ్య సేవలను మరింత బలోపేతం
చేస్తున్నామన్నారు. దేశ చరిత్రలోనే తొలిసారిగా ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని
ప్రవేశపెట్టి.. వైద్య సేవలను మరింత చేరువ చేసిన ఘనత ఒక్క సీఎం వైఎస్ జగన్మోహన్
రెడ్డికే దక్కుతుందని మల్లాది విష్ణు తెలిపారు.
మూడున్నరేళ్లలో వైద్యరంగంలో అద్భుత ప్రగతి : చంద్రబాబు హయాంలో వైద్య ఆరోగ్య
శాఖ వెంటిలేటర్ పై ఉందని మల్లాది విష్ణు విమర్శించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి
ముఖ్యమంత్రి అయిన తర్వాతనే మరలా శాఖలో జీవం వచ్చిందన్నారు. ఆరోగ్యరంగంలో
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంస్కరణలకుగానూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో
గుర్తింపు లభిస్తోందని మల్లాది విష్ణు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల
ప్రకటించిన మూడు ప్రతిష్టాత్మక అవార్డులలో రెండు ఆంధ్రప్రదేశ్ ను వరించడం
మనందరికీ గర్వకారణమన్నారు. ప్రజలకు వైద్యం భారం కాకూడదన్నదే సీఎం వైఎస్
జగన్మోహన్ రెడ్డి ఆకాంక్ష అని మల్లాది విష్ణు వ్యాఖ్యానించారు. ఇందులో భాగంగా
నియోజకవర్గ వ్యాప్తంగా గత మూడేళ్లలో 925 మందికి రూ. 4 కోట్ల 30 లక్షల 58 వేల
రూపాయలకు సంబంధించి సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసినట్లు వెల్లడించారు. 89
మందికి రూ. 2 కోట్ల 37 లక్షల 92 వేల రూపాయలకు సంబంధించి ఎల్ఓసి పత్రాలను
అందించినట్లు చెప్పారు.
మొత్తంగా రూ. 6 కోట్ల 68 లక్షల 50 వేల లబ్ధి చేకూర్చినట్లు తెలిపారు. అలాగే
జీజీహెచ్ సహా అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య పరికరాలను పూర్తిస్థాయిలో
అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. అన్ని ఔషధ నిల్వ కేంద్రాలను
పూర్తిస్థాయిలో పటిష్టపరిచినట్లు తెలిపారు. మరోవైపు వాంబేకాలనీ, దేవీనగర్,
ఇందిరానాయక్ నగర్లలో ఒక్కొక్కటి రూ. 80 లక్షల వ్యయంతో నిర్మించిన అర్బన్
హెల్త్ సెంటర్ల నిర్మాణాలు తుది దశకు చేరుకోగా.. త్వరలోనే ప్రారంభిస్తామని
తెలియజేశారు. రోగులు కూడా ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆస్పత్రులపై అవగాహన కలిగి
ఉండాలని మల్లాది విష్ణు అన్నారు. ఇందుకోసం నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో
ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ ను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఆర్థిక ఇబ్బందులతో ఉన్న తమకు చేయూతనిచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్
రెడ్డికి, ఎమ్మెల్యే మల్లాది విష్ణుకి లబ్ధిదారులు హృదయపూర్వక ధన్యవాదాలు
తెలియజేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు ఉద్ధంటి సునీత,
శర్వాణీ మూర్తి, జానారెడ్డి తదితరులు పాల్గొన్నారు.